బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్... భగ్గుమన్న 'జాగృతి'

  • జూబ్లీహిల్స్ జాగృతి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
  • హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సంతోష్ రావుకు వ్యతిరేకంగా ప్లకార్డులు
  • కవిత ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటామన్న జాగృతి నేతలు
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ నుంచి ఆమెను సస్సెండ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే, ఆమె మద్దతుదారులు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.

జూబ్లీహిల్స్‌లోని జాగృతి ప్రధాన కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. 'జై కవితక్క.. జై జాగృతి' అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇదే సమయంలో, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సంతోష్ రావులకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో జాగృతి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా జాగృతి నేతలు మాట్లాడుతూ, కవితను పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల ఆమెకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు. తన తండ్రి కేసీఆర్‌పై సీబీఐ విచారణను ఆమె తట్టుకోలేకపోయారని తెలిపారు. చాలా రోజులుగా కవితను పార్టీకి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. సామాజిక తెలంగాణ కోసమే కవిత పోరాడుతున్నారని, బడుగు బలహీన వర్గాలు ఆమె వెంటే ఉంటాయని స్పష్టం చేశారు. కవిత ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు.

మరోవైపు, ఈ తాజా పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత తన సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయం నేపథ్యంలో, తన ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు ఆమె మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 


More Telugu News