హృదయపూర్వక ధన్యవాదాలు చిన్నన్నయ్యా!: పవన్ కల్యాణ్

  • నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
  • విషెస్ తెలిపిన నాగబాబు
  • అన్నయ్య బహుమతి.. నా రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగు అంటూ పవన్ వెల్లడి
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ (సెప్టెంబరు 2) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. "ప్రియమైన కల్యాణ్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అంటూ తమ్ముడ్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

అన్నయ్య శుభాకాంక్షలకు పవన్ కల్యాణ్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. "హృదయపూర్వక ధన్యవాదాలు చిన్నన్నయ్య నాగబాబు గారు. మీరు 'లా' చదివే సమయంలో నాకు బహుమతిగా ఇచ్చిన పుస్తకమే నాలో రాజకీయ చైతన్యాన్ని కలిగించింది" అని పవన్ పేర్కొన్నారు.

ప్రముఖ న్యాయ నిపుణుడు నానీ పాల్కివాలా రచించిన "వుయ్ ద నేషన్" అనే పుస్తకాన్ని నాగబాబు తనకు బహుమతిగా ఇచ్చారని, అదే తన ఆలోచనా విధానాన్ని మార్చి రాజకీయాల వైపు ప్రేరేపించిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తన రాజకీయ ప్రయాణానికి ఆ పుస్తకమే తొలి అడుగు అని పవన్ పరోక్షంగా తెలిపారు. ఇదే సమయంలో, ఎమ్మెల్సీగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు అందిస్తున్న సేవలు విజయవంతంగా కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. 


More Telugu News