సీఎంను విమర్శించిన గంటల్లోనే.. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై రేప్ కేసు, అరెస్ట్

  • పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా అరెస్ట్
  • మాజీ భార్య ఫిర్యాదుతో రేప్ కేసు నమోదు
  • హర్యానాలో అదుపులోకి తీసుకున్న పంజాబ్ పోలీసులు
  • సీఎంను విమర్శించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం
  • ఢిల్లీ నేతల వీడియోలు తన దగ్గరున్నాయని ఎమ్మెల్యే ఆరోపణ
  • ఇది ఢిల్లీ, పంజాబ్ మధ్య కబడ్డీ ఆట అని వ్యాఖ్య
పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ ఢిల్లీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను బహిరంగంగా విమర్శించిన కొన్ని గంటల్లోనే సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది.  

గత రాత్రి 10:17 గంటలకు పటియాలా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో హర్మిత్ సింగ్ మాజీ భార్య ఫిర్యాదు చేశారు. 2014 ఫిబ్రవరి నుంచి 2024 జూన్ మధ్య కాలంలో ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, మోసం చేశారని, బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన కొన్ని గంటల్లోనే, మంగళవారం ఉదయం హర్యానాలోని కర్నాల్‌లో ఉన్న బంధువుల గ్రామంలో హర్మీత్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్‌కు ముందు ఒక వీడియో విడుదల చేసిన హర్మిత్ సింగ్ తనపై రేప్ కేసు పెట్టారని, దీనిని తాను తేలిగ్గా తీసుకోనని హెచ్చరించారు. అనంతరం ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఆప్ ఢిల్లీ నేతలకు సంబంధించిన అశ్లీల వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అందుకే నాపై కక్ష సాధిస్తున్నారు. ఇది ఢిల్లీ, పంజాబ్ మధ్య మొదలైన కబడ్డీ ఆట" అని ఆయన ఆరోపించారు.

ఇటీవల రాష్ట్రంలో వరదల నియంత్రణ విషయంలో పార్టీ ఢిల్లీ నాయకత్వం, సీఎం భగవంత్ మాన్‌పై హర్మీత్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ కావడం పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


More Telugu News