RS Praveen Kumar: ఈ కుట్రలో చంద్రబాబు పాత్ర కూడా ఉంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar Alleges Chandrababu Role in Kaleshwaram Conspiracy
  • కాళేశ్వరం సీబీఐ విచారణపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
  • దర్యాప్తు వెనుక రాష్ట్రానికి నష్టం చేసే పెద్ద కుట్ర ఉందని ఆరోపణ
  • రేవంత్ రెడ్డి బెదిరింపులతోనే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని విమర్శ
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయడం వెనుక రాష్ట్రానికి వందేళ్ల పాటు నష్టం కలిగించే భారీ కుట్ర దాగి ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుట్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ ఆ ప్రాజెక్టుపై విష ప్రచారం చేశారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కిషన్ రెడ్డి రాసిన లేఖ ఆధారంగానే జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) రంగంలోకి దిగిందని అన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేసిన చంద్రబాబు కుట్రే ఇప్పుడు సీబీఐ విచారణ రూపంలో బయటకు వచ్చిందని ఆయన ఆరోపించారు.

అధికారులు ఎవరూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరించారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారమే పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను రూపొందించిందని, కేవలం రూ.6 కోట్లు రికవరీ చేయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మేడిగడ్డ ఘటనపై విచారణ జరిపిన కమిషన్, స్థానిక మహాదేవపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఎందుకు విచారించలేదని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆయన డాక్టరేట్‌పై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. డీపీఆర్ లేకుండా చేపడుతున్న కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌తో పాటు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంపైనా సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
RS Praveen Kumar
Kaleshwaram project
Chandrababu Naidu
Revanth Reddy
BRS
Telangana irrigation projects
CBI investigation
Medigadda barrage
Kishan Reddy
Palvai Harish Babu

More Telugu News