వైద్యురాలి వేషంలో ఆసుపత్రిలోకి వెళ్లి దొరికిపోయిన యువతి .. అసలు విషయం ఏమిటంటే..!

  • గుంటూరు జీజీహెచ్‌లో నకిలీ వైద్యురాలి పట్టివేత
  • తెల్లకోటు వేసుకుని, మెడలో స్టెతస్కోప్‌తో పిల్లల వార్డులో కలియతిరిగిన నకిలీ వైద్యురాలు దొడ్డా జ్యోతి
  • యువతిని పోలీసులకు అప్పగించిన ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది
  • వైద్యురాలిని కావాలన్న కోరిక తీరకపోవడంతో ఇలా చేశానన్న జ్యోతి
గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో ఓ నకిలీ వైద్యురాలు హల్ చల్ చేయడం చర్చనీయాంశమైంది. తెల్ల కోటు ధరించి, మెడలో స్టెతస్కోప్ వేసుకుని వైద్యురాలిగా ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో ఓ యువతి కలియ తిరుగుతూ తల్లిదండ్రులతో మాట్లాడుతుండగా, అక్కడే విధుల్లో ఉన్న వైద్య విద్యార్థులకు అనుమానం రావడంతో ఆమె వైద్యురాలు కాదన్న విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు రూరల్ మండలం దాసరిపాలేనికి చెందిన దొడ్డా జ్యోతి అనే యువతి వైద్యురాలి వేషధారణలో ఆసుపత్రికి వచ్చి చిన్నారుల ఆరోగ్యంపై ఆరా తీస్తుండగా, వైద్య సిబ్బంది ఆమెను అడ్డగించి భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆమెతో పాటు ఉన్న వంశీ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గతంలో జీజీహెచ్‌లో చిన్నారుల అపహరణ ఘటన జరిగిన నేపథ్యంలో, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని పోలీసులను అప్రమత్తం చేశారు. జ్యోతి ఆసుపత్రిలోకి ఎలాంటి ఉద్దేశంతో వచ్చిందనే అంశంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

"డాక్టర్ కావాలని కోరిక... ఒత్తిడితో వచ్చాను" : జ్యోతి

పోలీసుల విచారణలో జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. తాను చిన్నతనం నుండి డాక్టర్ అవ్వాలనే కోరికతో పెరిగానని, కానీ అది నెరవేరకపోవడంతో మానసిక ఒత్తిడిలో ఆసుపత్రికి వచ్చానని తెలిపింది. గతంలో కూడా తాను వైద్యురాలిగా వేషధారణలో ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని ఆమె చెప్పినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఆసుపత్రుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


More Telugu News