మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఒక పిచ్చోడు: థామస్

  • నారాయణస్వామి ఓ పిచ్చోడని, అవినీతిపరుడని థామస్ తీవ్ర వ్యాఖ్యలు
  • సిట్ అధికారులు రాగానే కాళ్లపై సాష్టాంగ నమస్కారం చేశారని ఎద్దేవా
  • ఆయన ఫోన్‌ను సిట్ తీసుకెళ్లడం కన్నా పెద్ద అవమానం లేదని వ్యాఖ్య
వైసీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై ప్రభుత్వ విప్‌, టీడీపీ ఎమ్మెల్యే థామస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనో అవినీతిపరుడని, పిచ్చోడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ స్కామ్‌లో సిట్ అధికారులు విచారణకు ఇంటికి వస్తే, వారి కాళ్లపై సాష్టాంగపడి నమస్కరించారని, ఇంతకన్నా గలీజు మరొకటి ఉంటుందా? అని నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం ధర్మ చెరువు గ్రామంలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా థామస్‌ మాట్లాడుతూ.. "ఏ తప్పు చేయకపోతే సిట్ అధికారులు మీ ఇంటికి ఎందుకు వస్తారు? ‘అయ్యా నాకేమీ తెలియదు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేశాను’ అని చెబుతావా?" అంటూ నారాయణస్వామిని ఎద్దేవా చేశారు. "మాజీ డిప్యూటీ సీఎం ఫోన్‌ను సిట్ అధికారులు తీసుకెళ్లారు. అంత పెద్ద అవమానం జరిగితే నేనైతే ఊరి వేసుకొని చచ్చిపోతా. మేం ఏమైనా అవినీతికి పాల్పడ్డామా? పోలీసుల కాళ్లు పట్టుకున్నామా?" అని ఆయన ప్రశ్నించారు.

గతంలో నారాయణస్వామి పనితీరును థామస్ తీవ్రంగా విమర్శించారు. "ఒక లెటర్‌పై సంతకం పెట్టాలంటే నారాయణస్వామికి నాటుకోడి తీసుకురావాలి, వంకాయలు, బెండకాయలు ఇవ్వాలి. కానీ నేను అలా కాదు, ప్రజల కోసం ఏ లెటర్‌పైనైనా వెంటనే సంతకం పెడతాను. ఇలాంటి పనికిమాలిన వ్యక్తిని 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో భాగంగా సిట్ అధికారులు ఇటీవల మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థామస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. 


More Telugu News