Election Commission of India: ఈసీ, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు... సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Supreme Court comments on Election Commission political party differences
  • బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టులో విచారణ
  • నామినేషన్ల చివరి తేదీ వరకు సవరణలకు అవకాశం ఇస్తామన్న ఈసీ
  • రాజకీయ పార్టీలు, ఈసీ మధ్య విభేదాలు బాధాకరం అన్న సుప్రీంకోర్టు
బీహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల కోసం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం (ఈసీ) కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 1తో ముగిసిన గడువుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేలిపోయింది.

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఎన్నికల సంఘం ఆగస్టు 1న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు సెప్టెంబర్ 1ని తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువును పొడిగించాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన వైఖరిని తెలియజేసింది. అభ్యంతరాలను సెప్టెంబర్ 30 తర్వాత కూడా స్వీకరిస్తామని, నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు సవరణలు కొనసాగుతాయని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.

ఈసీ వివరణ అనంతరం, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి విభేదాలు తలెత్తడం దురదృష్టకరమని అభిప్రాయపడింది. అదే సమయంలో, ఓటర్ల జాబితాలో ఫిర్యాదులు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను నియమించాలని బీహార్ లీగల్ సర్వే అథారిటీని ఆదేశించింది.

కాగా, ఈసీ విడుదల చేసిన ముసాయిదా జాబితా నుంచి సుమారు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడం, పౌరసత్వంపై అనుమానాలున్న 3 లక్షల మందికి నోటీసులు జారీ చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. 
Election Commission of India
Bihar elections
voter list
Supreme court
political parties
voter registration
nomination deadline
India news

More Telugu News