Chandrababu Naidu: భవిష్యత్తును ఊహించి ముందుకెళ్లే దార్శనికుడు సీఎం చంద్రబాబు: పవన్ కల్యాణ్

Chandrababu Naidu Visionary Leader Says Pawan Kalyan
  • 30 ఏళ్ల కిందట తొలిసారిగా సీఎం బాధ్యతలు అందుకున్న చంద్రబాబు
  • శుభాకాంక్షలు తెలియజేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయం అని కితాబు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లయింది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. చంద్రబాబు దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయం అని కొనియాడారు. 

"భవిష్యత్తును ఊహించి ప్రణాళికబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దార్శనికుడు చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాలనా దక్షతతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణలు అభివృద్ధిని పరుగులు పెట్టించాయి. పాలనలో ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా సవాళ్లుగా స్వీకరించి ముందడుగు వేశారు. 

హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో కొండలు, గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. 90వ దశకంలో ఆయన ఐటీ రంగానికి పెద్దపీట వేయడం వల్లే తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల నుంచి ఐటీ ఉద్యోగులు వచ్చారు. రైతు బజార్ల ఏర్పాటు, డ్వాక్రా సంఘాల స్థాపన, పేదల కోసం వెలుగు ప్రాజెక్టు ప్రారంభం, మీసేవా కేంద్రాల ఏర్పాటు వంటి నూతన ఆవిష్కరణలు చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనం. 

రాష్ట్ర విభజన అనంతరం క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లారు. ప్రజా రాజధానిగా అమరావతి, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు, వీటితోపాటు పారిశ్రామికవృద్ధి లక్ష్యంగా 2014లో పాలన మొదలుపెట్టారు. 2024లోనూ మరింత క్లిష్ట  పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టారు. కఠిన సవాళ్లు ముందున్నా దృఢచిత్తంతో పాలన వ్యవస్థను ముందుకు తీసుకెళుతున్నారు. 

రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టులకు నిధులు సాధించడం చంద్రబాబు నాయకత్వ లక్షణాలను తెలియజేస్తుంది. పాలనా వ్యవహారాల్లో టెక్నాలజీ వినియోగిస్తూ, ప్రజలకు సత్వర సేవలు అందేలా చేస్తున్నారు. దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి నిర్దేశకత్వంలో మా మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తోంది" అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 
Chandrababu Naidu
Pawan Kalyan
Andhra Pradesh
AP Development
Amaravati
Polavaram Project
IT Industry
Telugu States
Modernization
Governance

More Telugu News