ద్రావిడ్ ను పొమ్మనలేక పొగబెట్టారు: డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు

  • రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న ద్రావిడ్
  • ఇది పరోక్షంగా తప్పించడమేనన్న ఏబీ డివిలియర్స్
  • ద్రావిడ్ నిర్ణయాలకు ఫ్రాంచైజీ విలువ ఇవ్వలేదని వ్యాఖ్య
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ వైదొలగడంపై నెలకొన్న చర్చకు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ద్రావిడ్‌ను ఫ్రాంచైజీ గౌరవంగా సాగనంపలేదని, పొమ్మనలేక పొగబెట్టిందన్న రీతిలో వారి వైఖరి ఉందని ఏబీడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఈ విషయంపై ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ, "ఫుట్‌బాల్ లీగ్స్‌లో కోచ్‌లు, మేనేజర్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. గెలవనప్పుడు విమర్శలు తప్పవు. అయితే ద్రావిడ్ విషయంలో ఏం జరిగిందనేది కచ్చితంగా తెలియదు. నాకు అందిన సమాచారం ప్రకారం, ఫ్రాంచైజీ అతడికి వేరే బాధ్యతలు అప్పగించాలని చూసింది. కానీ, ద్రావిడ్ అందుకు అంగీకరించలేదు. అంటే, దీనర్థం అతడిని పరోక్షంగా ఆ పదవి నుంచి తొలగించినట్లే" అని అభిప్రాయపడ్డాడు. వచ్చే సీజన్‌కు కొత్త ఆలోచనలతో సిద్ధమయ్యేందుకే రాజస్థాన్ యాజమాన్యం కోచింగ్ బృందంలో మార్పులు చేస్తుండవచ్చని అన్నాడు.

గత మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ అనుసరించిన వ్యూహాలు కూడా సరిగ్గా లేవని ఏబీడీ విమర్శించాడు. "గత వేలంలో ఆర్ఆర్ అద్భుతమైన ఆటగాళ్లను వదులుకుంది. ఒకరిద్దరిని మారిస్తే పర్వాలేదు, కానీ ఒకేసారి ఎక్కువ మందిని తొలగించడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది" అని డివిలియర్స్ విశ్లేషించాడు.

మరోవైపు, ఫ్రాంచైజీలో అంతర్గతంగా మరిన్ని విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ సంజు శాంసన్ కూడా జట్టును వీడతాడనే ప్రచారం జరుగుతోంది. అతని స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని ద్రావిడ్ సూచించగా, యాజమాన్యం మాత్రం రియాన్ పరాగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ ద్రావిడ్ నిష్క్రమణకు దారితీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు వాస్తవాలు భవిష్యత్తులో బయటకు వస్తాయని ఏబీడీ పేర్కొన్నారు. 


More Telugu News