అశ్విన్ ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది: ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌పై ఏబీ డివిలియర్స్ ప్రశంసలు
  • చెన్నై జట్టును అశ్విన్ విడిచిపెట్టకుండా ఉండాల్సిందని వ్యాఖ్య
  • ఇతర జట్లలో ఆడినప్పుడు అశ్విన్ స్థిరంగా కనిపించలేదని అభిప్రాయం
  • అశ్విన్‌ను ఆటలో ఒక శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌గా అభివర్ణించిన ఏబీడీ
  • బ్యాట్స్‌మన్‌గా అతని ప్రతిభను చాలామంది తక్కువ అంచనా వేశారన్న డివిలియర్స్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టును విడిచిపెట్టి ఉండాల్సింది కాదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెట‌ర్‌ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఇతర ఏ జట్టులోనూ అశ్విన్ స్థిరంగా ఇమడలేకపోయినట్లు తనకు అనిపించిందని అన్నాడు. ఇటీవ‌ల‌ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ కెరీర్‌పై డివిలియర్స్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ప్లాట్‌ఫామ్‌లో నిర్వహించిన ఒక లైవ్ సెషన్‌లో డివిలియర్స్ మాట్లాడుతూ, "అశ్విన్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఆట నియమాలను లోతుగా అధ్యయనం చేసే అతని పద్ధతి అమోఘం. అతనో క్రికెట్ శాస్త్రవేత్త, ఒక ప్రొఫెసర్ లాంటి వాడు. అలాంటి ఆటగాళ్లంటే నాకు ఎంతో గౌరవం" అని ప్రశంసించాడు. టీమిండియాకు, ముఖ్యంగా సీఎస్‌కేకు అశ్విన్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని గుర్తుచేశాడు.

"అశ్విన్ చెన్నై తర్వాత వేరే జట్లకు ఆడినప్పటికీ, నాకు మాత్రం అతను ఎప్పటికీ పసుపు జెర్సీ ఆటగాడిగానే గుర్తుండిపోతాడు. నా అభిప్రాయం ప్రకారం, అతను ఎల్లప్పుడూ సీఎస్‌కేతోనే కొనసాగి ఉండాల్సింది. ఆటగాళ్ల రిటెన్షన్, వేలం వంటి ప్రక్రియల్లో ఎన్నో అంశాలు ఉంటాయి కాబట్టి అది అతని చేతుల్లో లేకపోవచ్చు. కానీ, అతడిని నేను ఎప్పటికీ సీఎస్‌కే ఆటగాడిగానే చూస్తాను" అని డివిలియర్స్ పేర్కొన్నాడు.

అంతేకాదు, బ్యాట్స్‌మన్‌గా అశ్విన్ ప్రతిభను చాలామంది తక్కువగా అంచనా వేశారని డివిలియర్స్ అన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాట్‌తో ఎన్నోసార్లు ఆదుకున్నాడని, అతనిలో పోరాట పటిమ అద్భుతమని కొనియాడాడు.

ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత 38 ఏళ్ల అశ్విన్ ఈ లీగ్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగుల్లో ఆడటంపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్, 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టాడు. 2024 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.


More Telugu News