నాయనమ్మ మృతిపై అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్

  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం
  • బన్నీ నాయనమ్మ అల్లు కనకరత్నం కన్నుమూత 
  • సంతాపం తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ, దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి అల్లు కనకరత్నం (94) శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆమె, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. శనివారమే హైదరాబాద్‌లోని కోకాపేటలో ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యుల మధ్య ముగిశాయి.

ఈ నేపథ్యంలో, నాయనమ్మతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. "మా ప్రియమైన నాయనమ్మ అల్లు కనకరత్నం గారు స్వర్గస్తులయ్యారు. ఆమె ప్రేమ, వివేకం, ఆప్యాయతలను మేము ప్రతిరోజూ కోల్పోతాం" అని ఆయన పేర్కొన్నారు.

కష్టకాలంలో తమకు అండగా నిలిచి, ప్రేమను పంచుకుని, సంతాపం తెలియజేసిన ప్రతి ఒక్కరికీ అల్లు అర్జున్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "దూరంగా ఉన్నప్పటికీ, మీ ప్రార్థనలు, ప్రేమ మాకు చేరాయి. మీ అభిమానానికి ధన్యవాదాలు" అంటూ వినమ్రంగా స్పందించారు. ఈ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అల్లు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా తన అత్తగారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. "మా అత్తగారు, శ్రీ అల్లు రామలింగయ్య గారి అర్ధాంగి కనకరత్నమ్మ గారు కాలం చేయడం చాలా బాధాకరం. ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు మా కుటుంబాలకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అంటూ చిరంజీవి ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.

కొన్ని నెలల క్రితం, "పుష్ప 2" ప్రీమియర్ సందర్భంగా జరిగిన ఒక ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జైలు నుంచి తిరిగి వచ్చిన మనవడిని చూసి చలించిపోయిన కనకరత్నం గారు, ఆయనకు దిష్టి తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో వారిద్దరి మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని తెలియజేసి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. నేడు ఆమె మరణంతో అల్లు, మెగా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


More Telugu News