5 తులాల బంగారు గొలుసుతో వినాయకుడి నిమజ్జనం... ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • ఇంట్లో గణపతికి 5 తులాల బంగారు గొలుసుతో అలంకరణ
  • పూజల అనంతరం గొలుసు తీయకుండానే నిమజ్జనం
  • విషయం గుర్తొచ్చి కుటుంబసభ్యుల తీవ్ర ఆందోళన
  • రంగంలోకి దిగిన తుర్కయంజాల్ మున్సిపల్ సిబ్బంది
  • ఎక్స్‌కవేటర్‌తో విగ్రహాన్ని బయటకు తీసి గొలుసు అందజేత
  • గణపయ్యే తమ బంగారం తిరిగి ఇచ్చాడంటూ ఆనందం
భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వినాయక విగ్రహంతో పాటు ఐదు తులాల బంగారు గొలుసును ఓ కుటుంబం పొరపాటున నిమజ్జనం చేసింది. ఆ తర్వాత విషయం గుర్తొచ్చి తీవ్ర ఆందోళనకు గురైన ఆ కుటుంబానికి మున్సిపల్ సిబ్బంది సహాయంతో ఊరట లభించింది. ఈ ఆసక్తికర ఘటన శనివారం తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువు వద్ద చోటుచేసుకుంది.

వనస్థలిపురం, హస్తినాపురంలోని హోం ప్రసాద్ అపార్టుమెంట్‌లో నివసించే గిరిజ, ఆమె కుటుంబసభ్యులు వినాయక చవితి సందర్భంగా తమ ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామివారికి తమ ఇంట్లోని 5 తులాల బంగారు గొలుసును అలంకరించి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న కుటుంబసభ్యులంతా కలిసి ఆ విగ్రహాన్ని తుర్కయంజాల్ మాసబ్ చెరువులో నిమజ్జనం చేశారు.

నిమజ్జనం పూర్తి చేసుకుని చెరువు కట్టపైకి వచ్చిన తర్వాత కుటుంబంలోని ఒకరికి విగ్రహం మెడలోని బంగారు గొలుసు విషయం గుర్తుకువచ్చింది. దీంతో వారంతా ఒక్కసారిగా కంగారు పడిపోయారు. వెంటనే తేరుకుని అక్కడే ఉన్న తుర్కయంజాల్ మునిసిపాలిటీ సిబ్బందికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది ఎక్స్‌కవేటర్‌ను తీసుకొచ్చి చెరువులో మునిగిపోయిన విగ్రహాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. విగ్రహం మెడలో ఉన్న గొలుసును సురక్షితంగా బాధిత కుటుంబానికి అందజేశారు. పోయిందనుకున్న తమ బంగారం తిరిగి చేతికి అందడంతో ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ బంగారాన్ని స్వయంగా వినాయకుడే తిరిగి ఇప్పించాడని వారు సంతోషం వ్యక్తం చేశారు.


More Telugu News