Harish Rao: అసెంబ్లీ సమావేశాల వేళ... హైకోర్టులో హరీశ్ రావు లంచ్ మోషన్ పిటిషన్

Harish Rao Files Lunch Motion Petition in High Court on Kaleshwaram Project During Assembly Sessions
  • కాళేశ్వరం నివేదికపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ
  • రేపు అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టేందుకు సర్కార్ సన్నాహాలు
  • ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో హరీశ్ రావు పిటిషన్
  • నివేదికను సభలో పెట్టకుండా ఆదేశాలివ్వాలంటూ కోరిన మాజీ మంత్రి
  • రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్న లంచ్ మోషన్ పిటిషన్
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో, బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసి, రేపు సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, హరీశ్‌ రావు అనూహ్యంగా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని, దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ వద్ద పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

గతంలో కూడా కాళేశ్వరం కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్‌, హరీశ్‌ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు, తదుపరి విచారణను అక్టోబర్‌ 7వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌ రావు మాట్లాడారు. కాళేశ్వరంపై తాము పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే ప్రభుత్వానికి భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలు వినడానికి మంత్రి శ్రీధర్ బాబు సిద్ధంగా లేరని విమర్శించారు. ప్రాజెక్టు విషయంలో తప్పులు ఎవరు చేశారనేది ప్రజలు, న్యాయస్థానాలే తేలుస్తాయని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. 
Harish Rao
Kaleshwaram Project
Telangana Assembly
Revanth Reddy
Justice Chandraghosh Committee
Telangana Politics
BRS Party
Sridhar Babu
High Court Petition

More Telugu News