Rajnath Singh: మిత్రులు, శత్రువులు శాశ్వతం కాదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం: అమెరికాకు రాజ్‌నాథ్ కౌంటర్

No permanent friends or enemies only permanent interests sasy Defence Minister Rajnath Singh
  • అమెరికా సుంకాల బెదిరింపులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు
  • అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న రాజ్‌నాథ్
  • దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టీకరణ
  • రైతులు, వ్యాపారుల సంక్షేమం విషయంలో రాజీపడేది లేదని వెల్లడి
  • ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన రక్షణ మంత్రి
అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులు గానీ ఉండరని, కేవలం దేశ శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు బెదిరింపుల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎంతటి ఒత్తిడి ఎదురైనా దేశ ప్రజలు, రైతుల ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.

శనివారం జరిగిన ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్ 2025లో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు ఆపాలంటూ, ట్రంప్ భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాన్ని విధిస్తూ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపులను ఉద్దేశించి రాజ్‌నాథ్ పరోక్షంగా స్పందించారు. "ప్రపంచం వేగంగా మారుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్నాయి. వాణిజ్య, సుంకాల యుద్ధం తీవ్రమవుతోంది" అని ఆయన అన్నారు.

ఈ పరిస్థితుల్లో భారత్ తన సొంత ప్రయోజనాలకు కట్టుబడి ఉంటుందని ఆయన స్ప‌ష్టం చేశారు. "మా దేశ రైతులు, చిన్న వ్యాపారులు, పౌరుల ప్రయోజనాలే మాకు ప్రథమ ప్రాధాన్యం. వారి సంక్షేమం విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడబోం. మాపై ఎంత ఒత్తిడి పెంచినా మా విధానాలు మారవు" అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

ఒత్తిళ్లు పెరిగేకొద్దీ భారత్ మరింత బలపడుతుందని, ఆత్మనిర్భరత లక్ష్యంతో ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. తమ సిద్ధాంతాలు, నైతిక విలువల విషయంలో ప్రధాని మోదీ ఎన్నడూ రాజీపడరని ఆయన గుర్తుచేశారు. భారత్ ఎవరినీ శత్రువుగా చూడదని, కానీ దేశ ప్రయోజనాలకు ఎవరు అడ్డువచ్చినా ఉపేక్షించేది లేదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
Rajnath Singh
India
America
Donald Trump
Trade war
Defense Summit
International relations
Indian farmers
Tariffs
National interest

More Telugu News