చొరబాట్లు ఆగకపోతే అమిత్ షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి.. టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్య

  • సరిహద్దు భద్రత విషయంలో కేంద్రం విఫలమైందన్న మహువా మొయిత్రా
  • మహువా వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ.. పోలీసులకు ఫిర్యాదు
  • టీఎంసీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని కమలదళం డిమాండ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దేశ సరిహద్దుల భద్రతను గాలికొదిలేసిన అమిత్ షా తల నరికి బల్లపై పెట్టాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో మహువా మొయిత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాట్లను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. సరిహద్దు భద్రత బాధ్యత పూర్తిగా హోం శాఖదేనని, ఐదు భద్రతా దళాలు ఆ శాఖ పరిధిలోనే పనిచేస్తాయని గుర్తుచేశారు.

"మన సరిహద్దులను కాపాడేవారు లేనప్పుడు, ప్రతిరోజూ పక్క దేశం నుంచి ప్రజలు మన దేశంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, చొరబాటుదారులు మన తల్లులు, సోదరీమణులపై కన్నేస్తూ మన భూములను ఆక్రమిస్తున్నారని పౌరులు ఫిర్యాదు చేస్తుంటే.. మొదట మీరు హోం మంత్రి అమిత్ షా తల నరికి బల్లపై పెట్టాలి" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ చొరబాట్ల గురించి మాట్లాడుతుంటే ముందు వరుసలో కూర్చున్న హోం మంత్రి చప్పట్లు కొట్టారని ఆమె ఎద్దేవా చేశారు.

మహువా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు అసహ్యకరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇది టీఎంసీ మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించాలని, ఒకవేళ ఇది పార్టీ వైఖరి కాకపోతే మహువా మొయిత్రాపై చర్యలు తీసుకుని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.


More Telugu News