మైదానంలో కొట్టుకోబోయిన క్రికెటర్లు.. మాటల యుద్ధం తర్వాత నితీశ్ రాణా విధ్వంసం

  • ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం
  • బౌలర్ దివ్‌గేశ్ రాఠీతో గొడవపడ్డ వెస్ట్ ఢిల్లీ కెప్టెన్ నితీశ్ రాణా
  • కొట్టుకునేంత వరకూ వెళ్లిన ఇరు జట్ల క్రికెటర్లు
  • గొడవ తర్వాత బ్యాట్‌తో రెచ్చిపోయిన రాణా
  • 54 బంతుల్లో 134 పరుగులు చేసి జట్టును గెలిపించిన వైనం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ రసాభాసగా మారింది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో భాగంగా శుక్రవారం వెస్ట్ ఢిల్లీ లయన్, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దూసుకెళ్లి కొట్టుకునేంత పనిచేశారు. ఈ ఘటనలో వెస్ట్ ఢిల్లీ లయన్ కెప్టెన్ నితీశ్ రాణా, సౌత్ ఢిల్లీ స్పిన్నర్ దివ్‌గేశ్ రాఠీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

మ్యాచ్ సమయంలో బౌలర్ రాఠీ బంతి వేయకుండా చివరి క్షణంలో ఆగిపోవడంతో బ్యాటర్ నితీశ్ రాణా అసహనానికి గురయ్యాడు. ఆ తర్వాతి బంతికి రాణా కూడా బ్యాటింగ్ చేయకుండా తప్పుకోవడంతో ఇద్దరి మధ్య ఉద్రిక్తత పెరిగింది. అదే ఓవర్లో రాణా రివర్స్ స్వీప్‌తో సిక్స్ కొట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఇద్దరూ మైదానంలోనే తీవ్రమైన మాటల యుద్ధానికి దిగారు.

ఈ గొడవ తర్వాత కూడా మ్యాచ్‌లో ఉద్రిక్తతలు చల్లారలేదు. మరో ఆటగాడు క్రిష్ యాదవ్ ఔటైన తర్వాత సౌత్ ఢిల్లీ ఆటగాళ్లు సుమిత్ మాథుర్, అమన్ భారతీతో అతడు వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు కలుగజేసుకుని ఒకరినొకరు తోసుకున్నారు. చివరికి అంపైర్లు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

బ్యాట్‌తోనే బదులిచ్చిన నితీశ్ రాణా
మైదానంలో జరిగిన గొడవతో మరింత కసిగా ఆడిన నితీశ్ రాణా, తన బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లోనే సెంచ‌రీ బాదాడు. మొత్తంగా 54 బంతుల్లోనే 134 పరుగులు (15 సిక్స‌ర్లు, 8 ఫోర్లు) చేసి అజేయంగా నిలిచాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 202 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్ట్ ఢిల్లీ జట్టు సునాయాసంగా ఛేదించి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్వాలిఫయర్ 2కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కాగా, రాణా తన అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ విజయంతో క్వాలిఫయర్ 2కు చేరిన వెస్ట్ ఢిల్లీ లయన్.. ఫైనల్ బెర్త్ కోసం ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది.


More Telugu News