విశాఖ ఐటీకి కొత్త జోష్.. 2 వేల మందితో టీసీఎస్ తొలి అడుగు

  • విశాఖ మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ కార్యాలయ ఏర్పాట్లు
  • రుషికొండ ఐటీ హిల్స్‌పై కంపెనీ పేరుతో బోర్డుల ఏర్పాటు
  • తొలి దశలో 2 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు
  • కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే తొలి ఐటీ ఒప్పందం
  • రూ.1,370 కోట్ల పెట్టుబడితో శాశ్వత క్యాంపస్ ప్రణాళిక
  • భవిష్యత్తులో 12 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విశాఖపట్నంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రుషికొండ సమీపంలోని ఐటీ హిల్-3లో ఉన్న మిలీనియం టవర్స్‌లో కంపెనీ తన కార్యాలయాన్ని వేగంగా సిద్ధం చేస్తోంది.

టీసీఎస్‌కు లీజు ప్రాతిపదికన కేటాయించిన 16, 17 బ్లాక్‌ల వద్ద కంపెనీ పేరుతో నిన్న బోర్డులు ఏర్పాటు చేశారు. కార్యాలయంలో ఉద్యోగులకు అవసరమైన ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చురుగ్గా సాగుతున్నాయి. తొలి విడతలో భాగంగా రెండు షిఫ్టులలో కలిపి సుమారు 2,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 6 వేలకు పైగా పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుదుర్చుకున్న మొదటి అతిపెద్ద ఐటీ ఒప్పందం ఇదే కావడం గమనార్హం. ఒప్పందం చేసుకున్న వంద రోజుల్లోనే కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చూస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గతంలో ప్రకటించారు. ఆ హామీకి అనుగుణంగానే టీసీఎస్ వేగంగా అడుగులు వేస్తుండటం విశాఖ ఐటీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

తాత్కాలిక కార్యాలయంతో పాటు శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు కూడా టీసీఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హిల్-3లోనే 22 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు రూ.1,370 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ఈ క్యాంపస్ ద్వారా భవిష్యత్తులో దాదాపు 12 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.


More Telugu News