రాష్ట్ర ప్రగతిలో సీఏలు మార్గదర్శకులు కావాలి: మంత్రి నారా లోకేశ్‌

  • 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమ‌న్న మంత్రి
  • రాష్ట్ర అభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్లు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని వ్యాఖ్య‌
  • ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామ‌న్న లోకేశ్‌
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయని వెల్ల‌డి
  • విశాఖకు గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు వ‌స్తున్నాయ‌న్న మంత్రి
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ బృహత్తర ప్రయాణంలో చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు) కేవలం భాగస్వాములుగా కాకుండా మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన ‘అర్థసమృద్ధి–2025’ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్‌ తెలిపారు. సీఏలు కేవలం ఖాతా పుస్తకాలు సరిచూసే ఆడిటర్లు మాత్రమే కాదని, బాధ్యతకు, జవాబుదారీతనానికి ప్రతిరూపాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి బ్రాండ్ అంబాసడర్లుగా మారి, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో నైతిక సలహాలు అందించాలని కోరారు. విశాఖపట్నంలో అకౌంటింగ్, ఆడిటింగ్ రంగంలో ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుకు ఐసీఏఐ చొరవ చూపాలని సూచించారు.

ఒకే రాజధాని.. ప్రాంతీయ అభివృద్ధి
‘ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ’ అనే నినాదంతో తాము ముందుకెళ్తున్నామని లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. అనంతపురంలో ఆటోమోటివ్, కర్నూలులో పునరుత్పాదక ఇంధనం, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. మరో ఏడాదిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

పాలనలో సాంకేతికతకు పెద్దపీట
పరిపాలనలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఏఐ ఆధారిత పాలన ద్వారా ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇప్పటికే ‘మనమిత్ర’ ద్వారా 700 రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాల వల్లే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖకు వస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఐసీఏఐ ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్, ఇతర ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.



More Telugu News