హైడ్రా పనితీరుపై హైకోర్టు ప్రశంసల వర్షం
- రాంనగర్లో రోడ్డును ఆక్రమించి కట్టిన వాణిజ్య భవనం కూల్చివేత
- కూల్చివేతపై బిల్డర్ పిటిషన్.. విచారణలో కోర్టు కీలక వ్యాఖ్యలు
- అక్రమ కట్టడాల తొలగింపులో హైడ్రా సేవలు అవసరమన్న న్యాయస్థానం
- ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని స్పష్టం చేసిన హైకోర్టు
హైదరాబాద్‌లోని రాంనగర్ మణెమ్మ వీధిలో రోడ్డును ఆక్రమించి ఒక వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. దీనిపై స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్ఎంసీ, హైడ్రా సహకారం తీసుకుంది. జమిస్తాన్పూర్ రాంనగర్ క్రాస్‌రోడ్ వద్ద రోడ్డుపై అక్రమంగా నిర్మించిన ఆ వాణిజ్య భవనాన్ని అధికారులు తొలగించారు. దీంతో రాంనగర్ ప్రధాన రహదారికి అడ్డంకి తొలగిపోయింది.
అయితే, తన భవనాన్ని కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఆ వాణిజ్య సముదాయ నిర్మాణదారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.