హైదరాబాద్‌లో సముద్రతీరం.. 35 ఎకరాల్లో అద్భుత నిర్మాణం!

  • రూపుదిద్దుకోనున్న ఆర్టిఫిషియల్ బీచ్
  • రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో 35 ఎకరాల్లో నిర్మాణం
  • రూ. 225 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
  • డిసెంబర్ నుంచే పనులు ప్రారంభించే అవకాశం
  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు
  • లగ్జరీ హోటళ్లు, ఫుడ్ కోర్టులతో పర్యాటక హబ్ ఏర్పాటు
భాగ్యనగర వాసులకు, పర్యాటకులకు శుభవార్త. సముద్రపు అలల సవ్వడి వినాలన్నా, ఇసుక తిన్నెలపై సేద తీరాలన్నా ఇకపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఆ అద్భుతమైన అనుభూతిని హైదరాబాద్ నగరంలోనే పొందే అవకాశం కలగనుంది. భూపరివేష్టిత రాష్ట్రమైన తెలంగాణలో సముద్ర తీర లోటును తీర్చేందుకు ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడలో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఒక కృత్రిమ సముద్ర తీరాన్ని (ఆర్టిఫిషియల్ బీచ్) నిర్మించబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 225 కోట్లు వెచ్చించనుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టులో కేవలం బీచ్ మాత్రమే కాకుండా పర్యాటకులను ఆకట్టుకునేలా అనేక ప్రత్యేకతలు ఉండనున్నాయి. చిన్నారులు, యువత కోసం స్పోర్ట్స్, వినోద కార్యక్రమాలు, పెద్దలు ప్రశాంతంగా గడిపేందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా పెద్ద సరస్సు, ఇసుక తిన్నెలు, వేవ్ పూల్స్, ఫౌంటెన్లు, లగ్జరీ హోటళ్లు, ఫ్లోటింగ్ విల్లాలు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు, సైక్లింగ్ ట్రాక్‌లు వంటివి కూడా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ బీచ్ హైదరాబాద్ పర్యాటక రంగంలో ఒక సరికొత్త ఆకర్షణగా నిలవనుందని భావిస్తున్నారు.


More Telugu News