కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

  • రాష్ట్రంలో కూటమి లేకపోతే అభివృద్ధిలో ముందుకు వెళ్లలేమన్న పవన్ 
  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, చేసిన మంచిని చెప్పాలని సూచన  
  • సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు అసెంబ్లీలో చర్చించాలన్న పవన్ 
రాష్ట్రాభివృద్ధికి కూటమి ఐక్యత అత్యంత కీలకమని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన శాసనసభాపక్ష సమావేశం నిన్న విశాఖ బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ సమావేశ మందిరంలో మూడు గంటలపాటు కొనసాగింది. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
 
కూటమి బలమే అభివృద్ధికి బాట

“రాష్ట్రంలో కూటమి లేకపోతే అభివృద్ధిలో ముందుకు వెళ్లలేం. మన ఐక్యతను మాటలకే పరిమితం చేయకుండా, మన పనుల ద్వారానే ప్రజలకు చూపించాలి” అని పవన్‌ స్పష్టం చేశారు. జనసేన మంత్రిత్వ శాఖల ద్వారా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను చేపట్టాలని, ఇతర శాఖల ద్వారా ప్రాజెక్టులను తీసుకురావాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
 
రైతుల సంక్షేమం, స్త్రీ శక్తి పథకం మీద దృష్టి
 
రైతులకు నిధుల జమ, మహిళల కోసం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, చేసిన మంచిని చెప్పాలని సూచించారు. "ప్రజల్లో మన పని పట్ల అవగాహన పెరగాలి" అని పవన్‌ తెలిపారు.
 
విశాఖలో నాటి ఘటన గుర్తు

వైసీపీ హయాంలో తనను పోలీసులు ఎలా అడ్డుకున్నారో గుర్తు చేస్తూ, “ఇప్పుడు మనం బలంగా ఉన్నాం అంటే కార్యకర్తలే కారణం. వారిని విస్మరించకూడదు” అన్నారు. కార్యకర్తల భావోద్వేగాలను గౌరవించాలన్నారు. 
 
సోషల్‌ మీడియా నియంత్రణపై చర్చ అవసరం
 
సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు అసెంబ్లీలో చర్చించాలని అన్నారు. “ఏది నిజం, ఏది అబద్ధమో ప్రజలు గుర్తించలేని అయోమయంలో ఉన్నారు” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
పార్టీ తీర్మానాలు 
 
శాసనసభాపక్ష సమావేశ అనంతరం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. 
 
పవన్‌ కల్యాణ్ సేవలకు అభినందన తీర్మానం: ఉపముఖ్యమంత్రిగా గ్రామ సభలు, పల్లె పండుగ, వరద విరాళాలు వంటి కార్యక్రమాలపై బొలిశెట్టి శ్రీనివాస్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కొణతాల రామకృష్ణ బలపరిచారు.
 
సోషల్‌ మీడియా దుర్వినియోగంపై చట్టం: ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలను అరికట్టేందుకు చట్టం అవసరమని పేర్కొంటూ, లోకం నాగమాధవి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఆరణి శ్రీనివాసులు బలపరిచారు.
 
చట్టసభల్లో ప్రజాప్రతినిధుల బాధ్యత తీర్మానం: జనవాణి ద్వారా ప్రజల సమస్యలు చట్టసభల్లో ప్రస్తావించాలన్న తీర్మానాన్ని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రవేశపెట్టగా, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బలపరిచారు.

.


More Telugu News