ఏపీలో 63 మంది ప్రభుత్వ వైద్యులకు ప్రొఫెసర్లుగా పదోన్నతి

  • నిబంధ‌న‌ల్ని స‌డ‌లించి ప‌దోన్న‌తి క‌ల్పించిన ప్ర‌భుత్వం
  • 9 మంది డీడీల‌కు  జేడీలుగా ప‌దోన్న‌తి
  • మంత్రి జోక్యంతో 20 ఏళ్ల తర్వాత ప్ర‌మోష‌న్‌
  • పోస్టింగ్‌లను ఆమోదించిన మంత్రి సత్యకుమార్ యాద‌వ్‌
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల కొరతను అధిగమించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 63 మందికి పదోన్నతి లభించింది. జాతీయ వైద్య సంఘం(ఎన్ఎంసి) నియమాల మేరకు వివిధ కళాశాలల్లో ప్రొఫెసర్ల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం నియమాలను సడలించింది. నిబంధనల మేరకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా మూడేళ్లు పనిచేసిన వారు ప్రొఫెసర్ పదోన్నతికి అర్హులు. దీనిని సడలింపు చేస్తూ...ఒక ఏడాది అనుభవమున్న అసోసియేట్ ప్రొఫెసర్‌లను ప్రొఫెసర్లుగా నియమించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు 11 క్లినికల్ విభాగాలు, 2 నాన్ క్లినికల్ విభాగాల్లో 63 మందిని డిపిసి(డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ) పదోన్నతికి సిఫారసు చేసింది. ఈ విధంగా పదోన్నతి పొందిన ప్రొఫెసర్‌లకు పోస్టింగులిస్తూ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఆదేశాలు జారీ చేశారు.

పదోన్నతి పొందిన వారిలో ఆప్తమాలజీ విభాగంలో 11 మంది, డెర్మటాలజీలో 9, ఇఎన్‌టి మరియు ఆర్థోపెడిక్స్‌లో ఏడుగురు చొప్పున, ఎనస్తీషియా, పిడియాట్రిక్స్‌లో ఐదుగురు చొప్పున, సైక్రియాట్రీలో నలుగురు, జనరల్ సర్జరీలో ముగ్గురు, జనరల్ మెడిసిన్‌లో ఇద్దరు, రేడియాలజీలో ఇద్దరు, గైనకాలజీలో ఒకరు పదోన్నతి పొందారు. నాన్ క్లినికల్ సబ్జెక్టులకు సంబంధించిన ఫోరెన్సిక్ మెడిసిన్‌లో ఐదుగురు, కమ్యూనిటీ మెడిసిన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు.

20 ఏళ్లకు ప్రమోషన్

వైద్యారోగ్య శాఖలో దీర్ఘకాలం పదోన్నతికి నోచుకోని డిప్యూటీ డైరెక్టర్లకు ఎట్టకేలకు ప్రమోషన్ లభించింది. సర్వీసు నియమాల ప్రకారం రెండేళ్లు డీడీగా పనిచేసిన వారు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతికి అర్హులు. అయినా, డిపిహెచ్ పరిధిలో పనిచేస్తున్న ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లు 18 నుండి 20 సంవత్సరాలుగా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు. మరో ఇద్దరు 11 సంవత్సరాలకు పైగా నిరీక్షిస్తున్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ జోక్యంతో వారికి ప్రమోషన్ లభించగా ఆ ఏడుగురికి మంత్రి పోస్టింగులిచ్చారు. పదోన్నతి పొందిన వీరు ప్రస్తుత స్థానాల్లోనే జేడీలుగా కొనసాగుతారు.

మందుల నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లకు పదోన్నతిపై జాయింట్ డైరెక్టర్లుగా మంత్రి పోస్టింగులిచ్చారు. రాజాభానును హెడ్ క్వార్టర్స్‌లోనూ, పాండురంగ ప్రసాద్‌ను విశాఖపట్నంలోనూ పోస్ట్ చేశారు. 


More Telugu News