ఏపీ రైతులకు గుడ్ న్యూస్ .. వారం ముందుగానే 10వేల మెట్రిక్ టన్నుల యూరియా

  • 10,350 మెట్రిక్ టన్నుల యూరియా నేడు గంగవరం పోర్టులో దిగుమతి
  • సమాచార లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన కేంద్ర ప్రభుత్వ ఎరువుల రసాయనిక మంత్రిత్వశాఖ
  • యూరియా సరఫరాపై కేంద్రానికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మ‌రో శుభ‌వార్త తెలిపారు. యూరియా సరఫరా విషయంపై కేంద్ర వ్యవసాయ ఎరువుల రసాయన మంత్రితో మాట్లాడటంతో నేడు రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా గంగవరం పోర్టునకు చేరుకుంటున్నదని మంత్రి అచ్చెన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు సత్వరమే సానుకూలంగా స్పందించి రాబోయే సెప్టెంబర్ నెల 6వ తేదీనాడు రావలసిన యూరియా సరుకును వారం ముందుగానే రాష్ట్రానికి సరఫరా చేసినందుకు కేంద్రానికి మంత్రి అచ్చెన్న‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో త్వ‌రిత‌గ‌తిన యూరియా రాష్ట్రానికి చేరుకుంటుంద‌ని అన్నారు. 

సెప్టెంబర్ మొదటి వారంలో మరో 25వేల మెట్రిక్ టన్నులు 

ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపియల్) కంపెనీ ద్వారా ఈ ఎరువులను గంగవరం పోర్టులో దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయ పంటల సాగు పరిస్థితి, వాటి దశలను బట్టి యూరియా అవ‌స‌రాల‌ను శాస్త్రీయంగా బేరీజు చేసుకుంటూ, ప్రణాళికబద్దంగా అత్యంత అవసరం ఉన్న ప్రాంతాల‌కు, తక్షణ పంట అవసరాలకు అనుగుణంగా మాత్రమే వ్యవసాయ అధికారుల పూర్తి పర్యవేక్షణలో రైతులకు యూరియాను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ క‌మిష‌న‌ర్ డిల్లీ రావుకు మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్ నెల మొదటి వారంలో కాకినాడ పోర్ట్‌కు సుమారు మరొక 25000 మెట్రిక్ టన్నుల యూరియాకు తక్కువ కాకుండా సరఫరాకు కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి తెలిపారు.  

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

రైతులు యూరియా సరఫరా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఖరీఫ్ సీజన్‌కి యూరియా పుష్కలంగా లభిస్తుందని హామీ ఇచ్చారు. రైతులు వారి పంట తక్షణ అవసరాలకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని, వచ్చే రబీ సీజన్‌కు ముందుస్తు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని రైతుల‌ను మంత్రి  విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులను ఇతర రాష్ట్రాలకు, పక్కదారి మళ్ళకుండా, అధిక ధరలకు అమ్మకుండా, నిఘా ఎన్ఫోర్స్మెంట్‌ను మరింత కట్టుదిట్టం చేసి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీల‌ ఆధ్వర్యంలో వ్యవసాయ, పోలీసు, విజిలెన్స్, రెవెన్యూ, పరిశ్రమల అధికారులతో సంయుక్త టీమ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలను చేస్తున్నామని తెలిపారు


More Telugu News