టెన్నిస్ దిగ్గజం మెద్వెదెవ్‌కు భారీ జరిమానా

  • యూఎస్ ఓపెన్ లో తొలి రౌండ్ లోనే ఓటమి
  • తీవ్ర అసహనంతో బ్యాట్ విరగ్గొట్టిన మెద్వెదెవ్
  • ప్రవర్తన సరిగా లేదంటూ 42,500 డాలర్ల ఫైన్ 
యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ లో తొలి రౌండ్ లోనే ఓటమి పాలై వెనుదిరిగిన టెన్నిస్ దిగ్గజం మెద్వెదెవ్ కు భారీ జరిమానా పడింది. ఓటమి తట్టుకోలేక ఈ రష్యన్ ఆటగాడు మ్యాచ్ తర్వాత బ్యాట్ విరగ్గొట్టాడు. అంతకుముందు ప్రేక్షకులతోనూ మెద్వెదెవ్ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆయనకు 42,500 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 37 లక్షలు) జరిమానా విధించినట్లు నిర్వాహకులు తెలిపారు.

మ్యాచ్ ఆడినందుకు నిర్వాహకులు చెల్లించే 1,10,000 డాలర్ల ప్రైజ్‌మనీలో మూడోవంతుకు పైగా మెద్వెదెవ్ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. టోర్నీలో భాగంగా మెద్వెదెవ్ ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్‌ బోంజితో తలపడ్డాడు. తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో బోంజి చేతిలో మెద్వెదెవ్ పరాజయం చవిచూశాడు.

రెండు సెట్లు కోల్పోయి.. రెండు సెట్లు గెలిచి..
తొలి రెండు సెట్లను మెద్వెదెవ్ కోల్పోయాడు. అయితే, ఆ తర్వాత పుంజుకుని మూడు, నాలుగో సెట్లలో గెలిచాడు. ఆ తర్వాత బోంజి, మెద్వెదెవ్ మధ్య జరిగిన ఐదో సెట్ హోరాహోరీగా సాగింది. ఈ క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ వల్ల ఆటకు ఆటంకం కలిగింది. ఆరు నిమిషాలపాటు ఆటను నిలిపివేసిన అంపైర్లు.. మళ్లి బోంజికి సర్వీస్‌ ఇచ్చారు. దీంతో ఛైర్‌ అంపైర్‌ గ్రెగ్ తో మెద్వెదెవ్ వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో ప్రేక్షకులు హేళన చేయగా.. మెద్వెదెవ్‌ కూడా అరుస్తూ వారిని రెచ్చగొట్టాడు. నాలుగో సెట్ గెలిచాక ప్రేక్షకులను చూస్తూ అసభ్య సైగలు చేశాడు.


More Telugu News