జన్‌ధన్ ఖాతాల్లో డబ్బుల వెల్లువ.. 11 ఏళ్లలో 12 రెట్లు పెరిగిన డిపాజిట్లు

  • 11 ఏళ్లలో 56 కోట్లకు పైగా చేరిన జన్‌ధన్ ఖాతాల సంఖ్య
  • ఖాతాల్లో రూ.2.68 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు
  • ఖాతాదారుల్లో 56 శాతం మహిళలే, 67 శాతం గ్రామీణ ప్రాంతాల వారే
  • 38 కోట్లకు పైగా రూపే కార్డుల జారీ.. పెరిగిన డిజిటల్ చెల్లింపులు
  • జన్‌ధన్ విస్తరణకు సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 11 ఏళ్లలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 56 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు, వాటిలో జమ అయిన మొత్తం డిపాజిట్లు రూ.2.68 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది.

ఈ పథకం ద్వారా తెరిచిన ఖాతాల్లో 67 శాతానికి పైగా గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లోనే ఉండటం విశేషం. అంతేకాకుండా మొత్తం ఖాతాదారుల్లో 56 శాతం మహిళలే ఉండటం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడానికి (డీబీటీ), రుణ సౌకర్యాలు, సామాజిక భద్రత కల్పించడానికి జన్‌ధన్ యోజన ఒక ప్రధాన మాధ్యమంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఈ పథకం కింద ఇప్పటివరకు 38 కోట్ల రూపే కార్డులను జారీ చేశారని, ఇవి దేశంలో డిజిటల్ లావాదేవీల పెరుగుదలకు కీలక పాత్ర పోషించాయని ప్రభుత్వం పేర్కొంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పీఓఎస్, ఈ-కామర్స్ ద్వారా 67 కోట్ల రూపే కార్డు లావాదేవీలు జరగగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 93.85 కోట్లకు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా, ప్రతి వయోజనుడికి బీమా, పింఛను సౌకర్యం ఉండాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. జన్‌ధన్ పథకం పరిధిని మరింత విస్తరించేందుకు సెప్టెంబర్ 30 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన వివరించారు.

"దేశంలోని 2.7 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక క్యాంపు అయినా ఏర్పాటు చేస్తాం. అర్హులైన వారు జన్‌ధన్ ఖాతాలు తెరవడం, జన్ సురక్ష పథకాల్లో చేరడం, కేవైసీ అప్‌డేట్ చేసుకోవడం వంటివి ఈ క్యాంపుల్లో పూర్తి చేయవచ్చు" అని మంత్రి తెలిపారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాల విషయంలో దాదాపు సంతృప్త స్థాయికి చేరుకున్నామని, బీమా, పింఛను కవరేజీ కూడా నిరంతరం పెరుగుతోందని ఆయన అన్నారు. గడచిన 11 ఏళ్లలో జన్‌ధన్ ఖాతాల సంఖ్య మూడు రెట్లు పెరగగా, డిపాజిట్లు సుమారు 12 రెట్లు పెరగడం గమనార్హం.


More Telugu News