అలాంటి ఏజెంట్లలో తెలుగు వాళ్లు కూడా ఉండడం దురదృష్టకరం: కేంద్ర మంత్రి పెమ్మసాని

  • విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
  • మయన్మార్‌లో చిక్కుకున్న 41 మంది భారతీయ యువత
  • విదేశాంగ శాఖ చొరవతో సురక్షితంగా స్వదేశానికి
  • తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని  
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో వెళ్లి ఏజెంట్ల మోసాలకు గురై, అష్టకష్టాలు పడుతున్న కొంతమందిని కేంద్ర ప్రభుత్వం కాపాడింది. మయన్మార్‌లో చిక్కుకున్న 41 మంది భారతీయులను విదేశాంగ శాఖ సురక్షితంగా భారతదేశానికి తీసుకువచ్చింది. నిన్న వీరంతా ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉండటం గమనార్హం.

బాధితులకు ఏపీ భవన్‌లో ఆశ్రయం

బాధితులు ఢిల్లీకి చేరిన వెంటనే ఏపీ భవన్‌లో వారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. అనంతరం వారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి తమ పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత ఏపీ భవన్ అధికారులు బాధితులను వారి స్వగ్రామాలకు పంపించారు.

థాయ్‌లాండ్ పేరిట మయన్మార్‌లోకి అక్రమ తరలింపు

ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను తొలుత థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి అటవీ మార్గం ద్వారా మయన్మార్‌కు అక్రమంగా తరలించారని తెలిపారు. అమెరికా, యూరప్‌ వంటి దేశాల నుంచి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడాలంటూ బలవంతంగా పని చేయించేందుకు ప్రయత్నించారని, అంగీకరించని వారిని చిత్రహింసలకు గురిచేశారన్నారు. కొందరు ఈ హింసలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నట్టు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు.

తెలుగువారు కూడా మోసాల్లో భాగస్వాములు

ఈ మోసాలకు పాల్పడిన ఏజెంట్లలో తెలుగువారు కూడా ఉండటం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. యువత స్పష్టత లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ స్కామ్స్‌లో చిక్కుకోవద్దని తెలిపారు. పిల్లలను విదేశాలకు పంపేటప్పుడు తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆరా తీయాలని పెమ్మసాని సూచించారు. 


More Telugu News