బాధితులపైనే కేసులు విడ్డూరం.. పోలీసుల తీరుపై అంబటి ఫైర్

  • పల్నాడు జిల్లా పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్న అంబటి రాంబాబు
  • పోలీసులు నిందితులను వదిలేసి బాధితుడిపైనే కేసు పెట్టారన్న అంబటి రాంబాబు
  • పోలీసులు నేరస్తులతో కుమ్మక్కు అవ్వడం సమాజానికి ప్రమాదకరమన్న వ్యాఖ్య
బాధితులపైనే కేసులు పెట్టడం దుర్మార్గమని, పల్నాడు పోలీసుల తీరుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టీ. అన్నవరంలో ఇటీవల టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త వెంకట ప్రసాద్‌ను మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి రాంబాబు పరామర్శించారు.

అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, పల్నాడు జిల్లా పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వెంకట ప్రసాద్‌పై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేశారని, ఇదివరకు రషీద్‌ను హత్య చేసినట్టే, ఇప్పుడు వెంకట ప్రసాద్‌ను కూడా చంపేందుకు యత్నించారన్నారు. చనిపోయాడనుకొని వదిలేసి వెళ్లిపోయారని, అయినా పోలీసులు నిందితులను వదిలేసి బాధితుడిపైనే కేసు పెట్టారని అన్నారు. నిందితులతో పోలీసులు కుమ్మక్కై బాధితుడిపైనే కేసు పెట్టారని ఆరోపించారు.

నిందితులపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిన పోలీసులు చిన్న పెట్టీ కేసు పెట్టారని దుయ్యబట్టారు. ఈ కేసును హత్య కేసుగా మార్పు చేయాలంటే ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీని కలవాలని, కానీ ఆయనను కలవాలంటే చంద్రబాబు, లోకేశ్‌ల వద్దకు వెళ్లాలని, అప్పుడు కానీ ఐజీ కలవరని అన్నారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కు అవ్వడం సమాజానికి ప్రమాదకరమని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 


More Telugu News