బహుశా ధోనీకి నేను నచ్చలేదేమో!: మనోజ్ తివారీ

  • టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర ఆరోపణలు
  • ధోనీ పక్షపాతం వల్లే తన కెరీర్‌కు అన్యాయం జరిగిందని తివారీ ఆవేదన
  • సెంచరీ చేసినా తర్వాతి మ్యాచ్‌లో జట్టు నుంచి తొలగించారని వెల్లడి
  • నన్ను ఎందుకు పక్కనపెట్టారో ధోనీని నిలదీస్తానన్న మనోజ్ తివారీ
  • కొంతమంది ఆటగాళ్లకే ధోనీ మద్దతు ఇచ్చేవారని సంచలన వ్యాఖ్యలు
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా కీర్తి గడించిన మహేంద్ర సింగ్ ధోనీపై, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు. ధోనీ నాయకత్వంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, అతడు అనుసరించిన పక్షపాత వైఖరి కారణంగానే తన అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తివారీ, తన కెరీర్‌కు సంబంధించిన అనేక ప్రశ్నలకు ధోనీ మాత్రమే సమాధానం చెప్పాలని అన్నాడు.

2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో తాను అద్భుతమైన శతకం సాధించిన విషయాన్ని తివారీ గుర్తుచేశాడు. అయితే, ఆ ప్రదర్శన తర్వాత జరిగిన మ్యాచ్‌కు తనను ఎందుకు జట్టు నుంచి తొలగించారో ఇప్పటికీ అర్థం కావడం లేదని వాపోయాడు. "ఒక ఆటగాడు సెంచరీ చేసిన తర్వాత అతడిని ఎవరైనా జట్టు నుంచి తప్పిస్తారా? కానీ నా విషయంలో అదే జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానం ఒక్క ధోనీ దగ్గరే ఉంది. అతడిని కలిసే అవకాశం వస్తే, సెంచరీ చేశాక నన్నెందుకు తొలగించారని తప్పకుండా అడుగుతాను. ఆ సమయంలో జట్టు నిర్ణయాలు తీసుకున్నది అతడే కదా" అని తివారీ తీవ్ర స్వరంతో ప్రశ్నించాడు.

కేవలం ఆ ఒక్క సందర్భంలోనే కాదని, శ్రీలంక పర్యటనలో జట్టులోకి పునరాగమనం చేసి, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలిచినా, మళ్లీ జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చిందని తివారీ గుర్తుచేసుకున్నాడు. ధోనీకి కొంతమంది ఆటగాళ్లంటే ప్రత్యేక అభిమానమని, వారికి అన్ని విధాలా మద్దతుగా నిలిచేవాడని తివారీ ఆరోపించాడు. కానీ తన విషయంలో మాత్రం అలాంటి ప్రోత్సాహం కరవైందని, బహుశా తాను అతడికి ఇష్టం లేని ఆటగాడిని కావచ్చని అభిప్రాయపడ్డాడు. "ఈ విషయం చాలా మందికి తెలుసు, కానీ ఎవరూ బయటకు మాట్లాడరు. క్రికెట్‌లో ఇలాంటి ఇష్టాయిష్టాలు సాధారణమే. బహుశా నేను ధోనీకి నచ్చని వాళ్ల జాబితాలో ఉండి ఉంటాను" అని అన్నాడు.

తన కెరీర్‌పై గాయాల ప్రభావం కూడా ఉందని అంగీకరించినప్పటికీ, ప్రధాన కారణం మాత్రం ధోనీ అనుసరించిన వైఖరే అని తివారీ స్పష్టం చేశాడు. ధోనీ నాయకత్వ లక్షణాలను తాను గౌరవిస్తానని, అతడు గొప్ప కెప్టెన్ అనడంలో సందేహం లేదని, కానీ తన వ్యక్తిగత కెరీర్ విషయంలో మాత్రం తీవ్ర అన్యాయం జరిగిందనే బాధ తనలో బలంగా ఉందని పేర్కొన్నాడు.

మనోజ్ తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వంలో క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. తివారీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో శివ్ పూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. 



More Telugu News