Telangana Education: విద్యార్థులు లేని 'జీరో' పాఠశాలలపై తెలంగాణ కీలక నిర్ణయం

Telangana Education Department Key Decision on Zero Student Schools
  • ఈ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయనున్న పాఠశాల విద్యాశాఖ
  • ఒక్క విద్యార్థి లేని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ స్థానంలో తెలంగాణ
  • 1,441 పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసిన విద్యా శాఖ
  • ఆయా ప్రాంతాల్లో తల్లిదండ్రులు కోరితే తెరవడానికి సిద్ధమన్న విద్యాశాఖ
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు లేని 'జీరో' ప్రభుత్వ పాఠశాలలపై పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు లేని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి వాటిని ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం గణాంకాల్లో చూపించరు. ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తెలంగాణలో అధికంగా ఉంది. 2024-25 విద్యా సంవత్సరపు లెక్కల ప్రకారం తెలంగాణలో ఇలాంటి పాఠశాలలు 2,245 ఉన్నాయి.

పాఠశాల విద్యా శాఖ పరిధిలో 2 వేలకు పైగా పాఠశాలలు ఉండగా, వాటిలో 1,441 చోట్ల విద్యార్థులు లేరు. ఉపాధ్యాయ పోస్టులు కూడా లేవు. మరో 600 పాఠశాలల్లో విద్యార్థులు లేకున్నా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతానికి 1,441 పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. మిగిలిన పాఠశాలలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పాఠశాలలు పని చేయడం లేనందున తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

గ్రామస్థులు తమ పిల్లలను బడికి పంపిస్తామని కోరితే పాఠశాలలను తిరిగి తెరుస్తామని, ఉపాధ్యాయులను కూడా నియమిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మారుమూల శివారు తండాల్లో కూడా తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది 200 పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు.
Telangana Education
Zero Enrollment Schools
School Closures
Government Schools
Education Department

More Telugu News