మాధురీ దీక్షిత్ ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్ 'మిస్సెస్ దేశ్ పాండే'. నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 19వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు ఇతర భాషలలోను అందుబాటులో ఉంది. చాలా గ్యాప్ తరువాత మాధురీ దీక్షిత్ చేసిన ఈ సిరీస్, ఫ్రెంచ్ మినీ సిరీస్ 'లా మాంటే'కి రీమేక్.
కథ: ముంబైలో వరుస హత్యలు జరుగుతుంటాయి. హంతకుడు నైలాన్ రోప్ ను మెడకి బిగించి హత్యలు చేస్తుంటాడు. అలా హత్య చేసిన తరువాత ఆ బాడీని అద్దానికి ఎదురుగా కూర్చోబెడుతూ ఉంటాడు. అలాగే శవం కళ్లు తెరుచుకుని ఉండేలా చేస్తుంటాడు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయం, కమిషనర్ అరుణ్ ఖత్రి (ప్రియాన్షు ఛటర్జీ)కి అర్థం కాదు. దాంతో ఆయన ఈ కేసును పరిష్కరించడానికిగాను స్పెషల్ ఆఫీసర్ గా తేజస్ (సిద్ధార్థ్ చందేకర్) ను రంగంలోకి దింపుతాడు.
తన్వీ ( దీక్షా జునేజా)తో కలిసి హ్యాపీగా గడుపుతున్న తేజస్, ఆల్రెడీ వేరే అండర్ కవర్ ఆపరేషన్ లో ఉంటే అతణ్ణి మధ్యలోనే పిలిపిస్తారు. గతంలో ఈ తరహా హత్యలు చేసిన 'మిస్సెస్ దేశ్ పాండే' (మాధురీ దీక్షిత్), ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉందని తేజస్ తో అరుణ్ చెబుతాడు. ప్రస్తుతం వరుస హత్యలకు పాల్పడుతున్న హంతకుడిని పట్టుకోవడానికి, దేశ్ పాండే సహాయం తీసుకుందామని అంటాడు. దేశ్ పాండే సాయం తీసుకుంటూనే ఆమె పారిపోకుండా చూసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు.
25 ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్న దేశ్ పాండేను, హైదరాబాద్ సెంట్రల్ జైలు నుంచి ముంబైకి రప్పిస్తారు. గతంలో ఎనిమిది హత్యలు చేసిన దేశ్ పాండే, ఇప్పుడు తన మాదిరిగానే హత్యలు చేస్తున్నది ఎవరై ఉంటారా అనే విషయంపై పూర్తి ఫోకస్ పెడుతుంది. తేజస్ ఇన్వెస్టిగేషన్ లో హోష్ .. అలెక్స్ .. సుహాస్ అనే పేర్లు తెరపైకి వస్తాయి. ఆ ముగ్గురూ ఎవరు? దేశ్ పాండేకి వాళ్లతో గల సంబంధం ఏమిటి? దేశ్ పాండే ఎందుకు హంతకురాలిగా మారింది? ఆమెను అనుసరిస్తూ వరుస హత్యలు చేస్తున్నది ఎవరు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఇది సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. ఒక హంతకుడిని పట్టుకోవడానికిగాను, ఆల్రెడీ శిక్షను అనుభవిస్తున్న ఒక హంతకురాలిని జైలు నుంచి బయటికి తీసుకురావడంతో ఈ కథపై ఆడియన్స్ కి ఆసక్తి పెరుగుతుంది. పాతికేళ్ల తరువాత ఆమె స్టైల్లో హత్యలు చేసుకుంటూ వెళుతున్నది ఎవరా అనే ఒక కుతూహలం అందరిలో పెరుగుతుంది. కొత్త హంతకుడు దొరుకుతాడా? పాత నేరస్థురాలు పారిపోతుందా? అనేది అందరిలో ఉత్కంఠను పెంచే మరో అంశం.
ఇలా ఈ కథలో ఆడియన్స్ ను టెన్షన్ పెట్టే మలుపులు ఉన్నాయి. అయితే ఆ మలుపుల వరకూ తీసుకుని వెళ్లే సన్నివేశాలు మాత్రం చాలా చప్పగా సాగుతాయి. కథలో పాత్రలు .. ఆ పాత్రల మధ్య గల సంబంధాలు .. ట్విస్టులు .. ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ .. దేశ్ పాండే వ్యూహాలు .. మరో వైపున హత్యలు .. ఇవన్నీ కూడా చాలా కూల్ గా జరుగుతూ సహనానికి పరీక్ష పెడుతూ ఉంటాయి.
కథ ఎప్పటికప్పుడు అనేక మలుపులు తీసుకుంటూ ఉంటుంది. కొత్త పాత్రలు తెరపైకి వస్తుంటాయి. అయితే అవేవీ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ కావు. హత్యల వెనుక గల అసలు కారణం కూడా ఆడియన్స్ ను పెద్దగా ప్రభావితం చేయలేకపోతోంది. కథ ఉంది .. పాత్రల మధ్య డ్రామా ఉంది .. అయితే కథనం నీరసించి పోవడం అసహనాన్ని కలిగిస్తుంది. ఒక్క చివరి ఎపిసోడ్ మినహా మిగతా ఎపిసోడ్స్ ఓ మాదిరిగా అనిపిస్తాయి అంతే.
పనితీరు: కొత్త హంతకుడు .. పాత నేరస్థురాలు .. ఒకరిని కాపాడుకుంటూ .. మరొకరిని పట్టుకునే ప్రయత్నంలో పోలీస్ డిపార్టుమెంట్. ఈ మధ్యలో కొత్త పాత్రలు .. కొన్ని మలుపులు. అయితే కథనం వేగంగా పరుగెత్తకపోవడం వలన .. పాత్రల మధ్య ఎమోషన్స్ ఎక్కువైపోయి యాక్షన్ తగ్గడం వలన ఆడియన్స్ లో ఓపిక సన్నగిల్లుతుంది. ఈ విషయంపై దర్శకుడు ఫోకస్ చేస్తే బాగుండేది.
మాధురీ దీక్షిత్ తో పాటు అందరూ బాగా చేశారు. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు.
ముగింపు: పోలీస్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ డ్రామా ఉన్న కథ ఇది. అయితే ఈ తరహా కథలు చకచకా పరిగెత్తాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కానీ ఈ కథ నిదానంగా .. నింపాదిగా నడవడమే ఆడియన్స్ కి అసహనాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇది ఓ మాదిరి సిరీస్ గానే చెప్పుకోవచ్చు.
'మిస్సెస్ దేశ్ పాండే' ( జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
Mrs Deshpande Review
- మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రగా సిరీస్
- 6 ఎపిసోడ్స్ గా వదిలిన కంటెంట్
- తెలుగులోను అందుబాటులోకి
- నిదానంగా సాగే కథాకథనాలు
- కనెక్ట్ కాని ఎమోషన్స్
Movie Details
Movie Name: Mrs Deshpande
Release Date: 2025-12-19
Cast: Madhuri Dixit, Pruyanshu Chatterjee, Siddharth Chandekar, Diksha Juneja, Nimisha Nair
Director: Nagesh Kukunoor
Music: -
Banner: A Kukunoor Movies
Review By: Peddinti
Trailer