వ్యాపారుల నుంచి వ్యతిరేకత... ఏపీలో బార్ల టెండర్లకు గడువు పెంపు

  • కొత్త పాలసీపై వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు టెండర్ల ప్రక్రియ
  • గడువు ముగిసినా ఆశించిన స్థాయిలో రాని దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కొత్త బార్ పాలసీకి మొదటి అడుగులోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు టెండర్లు ఆహ్వానించగా, మద్యం వ్యాపారుల నుంచి ఊహించని విధంగా నిరసన వ్యక్తమవడంతో దరఖాస్తులు దాదాపుగా రాలేదు. దీంతో కంగుతిన్న ఎక్సైజ్ శాఖ అధికారులు, టెండర్ల గడువును పొడిగించక తప్పలేదు.

వాస్తవానికి, బార్ అండ్ రెస్టారెంట్ల టెండర్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజు సాయంత్రంతో గడువు ముగిసింది. అయితే, కొత్త పాలసీలో నిబంధనలు ఆచరణ సాధ్యంగా లేవని, లోపభూయిష్టంగా ఉన్నాయని మద్యం వ్యాపారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ దరఖాస్తులు చేయకూడదని వారు ముందుగానే నిర్ణయించుకున్నారు. పాలసీలో కీలక మార్పులు చేసే వరకు తాము టెండర్ల ప్రక్రియలో పాల్గొనబోమని స్పష్టం చేస్తున్నారు.

వ్యాపారుల నుంచి స్పందన కరవవడంతో, ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువును ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, గడువు పొడిగించినంత మాత్రాన తాము దరఖాస్తులు చేసేది లేదని, ముందుగా పాలసీని సవరించాల్సిందేనని వ్యాపారులు పట్టుబడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. 


More Telugu News