క్లీన్ ఎనర్జీలో భారత్ సరికొత్త శకం.. ఇక మనమే గ్లోబల్ హబ్: ప్రధాని మోదీ

  • అహ్మదాబాద్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల ఉత్పత్తికి శ్రీకారం
  • 100 దేశాలకు 'మేడ్ ఇన్ ఇండియా' ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులు ప్రారంభం
  • క్లీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీలో భారత్ ప్రపంచ హబ్‌గా మారుతుంద‌న్న‌ ప్రధాని
  • భారత్‌లో బ్యాటరీల తయారీ కోసం మూడు జపాన్ కంపెనీల భాగస్వామ్యం
  • పెట్టుబడుల కోసం రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడాలని మోదీ పిలుపు
  • సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలపై ఇకపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్న ప్రధాని
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ, ఎగుమతుల రంగంలో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇకపై 'మేడ్ ఇన్ ఇండియా' ఈవీలు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. అహ్మదాబాద్‌లోని హన్సల్‌పూర్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎగుమతులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఇదే వేదికపై హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల స్థానిక ఉత్పత్తిని కూడా ఆయన ప్రారంభించడం విశేషం.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, క్లీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీ రంగాల్లో భారత్ ప్రపంచ హబ్‌గా అవతరించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. "గతంలో ఈవీలకు అత్యంత కీలకమైన బ్యాటరీలను మనం పూర్తిగా దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. మూడు ప్రముఖ జపాన్ కంపెనీలు కలిసి భారత్‌లోనే బ్యాటరీ సెల్స్, ఎలక్ట్రోడ్‌లను తయారు చేస్తున్నాయి. ఇది మన దేశ హైబ్రిడ్ వాహనాల మార్కెట్‌కు కొత్త ఊపునిస్తుంది" అని ఆయన వివరించారు.

భారత్-జపాన్ మధ్య బంధం కేవలం వ్యాపారానికే పరిమితం కాదని, చారిత్రక, సాంస్కృతిక మూలాలున్నాయని ప్రధాని గుర్తుచేశారు. "సుజుకి వంటి జపాన్ కంపెనీలు ఇక్కడ కార్లను తయారు చేసి, తిరిగి జపాన్‌కే ఎగుమతి చేస్తున్నాయి. ఇదే మన రెండు దేశాల సంబంధాల బలానికి నిదర్శనం. మారుతి సుజుకితో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళుతోంది" అని మోదీ వ్యాఖ్యానించారు.

గత దశాబ్దంలో తమ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, 'మేక్ ఇన్ ఇండియా' వంటి కార్యక్రమాల ఫలాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ప్ర‌ధాని మోదీ తెలిపారు. "వ్యాపార అనుకూల వాతావరణం, లాజిస్టిక్స్ పార్కులు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పెట్టుబడులకు అనువైన మార్గాల‌ను సృష్టించాం. ఫలితంగా పదేళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ 500 శాతం పెరిగింది" అని అన్నారు.

భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ, "మేం ఇక్కడితో ఆగిపోం. ఇకపై సెమీకండక్టర్ల తయారీపై దృష్టి పెడతాం. త్వరలో ఆరు ప్లాంట్లు సిద్ధం కాబోతున్నాయి. అదేవిధంగా కీలక ఖనిజాల కోసం 'నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్'ను ప్రారంభించాం" అని ప్రధాని వెల్లడించారు. అభివృద్ధి అనుకూల విధానాల రూపకల్పనలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడాలని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


More Telugu News