విమర్శకులకు హీరో నారా రోహిత్ కీలక సూచన

  • సుందరకాండ షూటింగ్ రోజులు ఎప్పటికీ మర్చిపోలేనన్న నారా రోహిత్
  • సినిమా చూసిన తర్వాత నచ్చకపోతే అభిప్రాయాన్ని స్పేచ్చగా చెప్పండని సూచన 
  • సినిమా ఒక పెద్ద టీమ్‌పై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య  
విమర్శకులకు ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ కీలక సూచన చేశారు. నారా రోహిత్ ప్రధాన పాత్రలో వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సుందరకాండ’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ భావోద్వేగ పూరితంగా మాట్లాడారు.
 
సుందరకాండ షూటింగ్ రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి దర్శకుడు వెంకటేశ్ కారణమని పేర్కొన్నారు. ఒక డైరెక్టర్, హీరో మీద నమ్మకంతో 6 ఏళ్ల పాటు నాతో కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించడం చిన్న విషయం కాదని రోహిత్ అన్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

ఇదే క్రమంలో సోషల్ మీడియాలో తనపై కోపంతో విమర్శిస్తూ పోస్టులు పెట్టే వారి గురించి రోహిత్ మాట్లాడుతూ.. ‘చాలా మంది నాపై కోపంతో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడతారు. వాళ్లకు నేను నచ్చకపోవచ్చు, కానీ సినిమా అనేది ఒక్కరిది కాదు, ఒక పెద్ద టీమ్‌పై ఆధారపడి ఉంటుంది’ అని అన్నారు. 

“నా మీద కోపం ఉంటే ఫర్వాలేదు, కానీ సినిమా చూడకుండా విమర్శించకండి. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి, నచ్చితే సపోర్ట్ చేయండి. నచ్చకపోతే మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పండి. కానీ అది సినిమా చూసిన తరువాతే చేయండి. ఇదే నా కోరిక’’ అని తెలిపారు.
 


More Telugu News