Lella Appireddy: గతంలో ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన ధృవపత్రాలను ఇప్పుడు కాదనడం వారిని అవమానించడమే!: లేళ్ల అప్పిరెడ్డి

Lella Appireddy Slams Government Over Disabled Pension Removals
  • దివ్యాంగుల పెన్షన్లను అడ్డగోలుగా తొలగిస్తున్నారంటూ అప్పిరెడ్డి మండిపాటు
  • ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోందని విమర్శ
  • తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక 
రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లను అడ్డగోలుగా తొలగిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. లక్షకు పైగా పెన్షన్లు రద్దు చేసి ప్రభుత్వం తన కర్కశత్వాన్ని చాటుకుందని ఆయన ఆరోపించారు. తొలగించిన పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దివ్యాంగుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం దారుణమని అప్పిరెడ్డి అన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడైనా ఇంత పెద్ద సంఖ్యలో పెన్షన్లు తొలగించారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ మానసిక వైకల్యంతో బాధపడుతోందని... అందుకే లక్షలాది మంది దివ్యాంగుల ఉసురు తీస్తున్నారని ఆయన విమర్శించారు. పల్నాడు జిల్లాలో పెన్షన్ కోల్పోయిన రామలింగారెడ్డి మరణాన్ని ప్రభుత్వ హత్యగా పరిగణిస్తున్నామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్న ప్రభుత్వం, కనీసం దివ్యాంగులకు పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతోందని అప్పిరెడ్డి దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా? కనీసం నడవలేని స్థితిలో ఉన్నవారికి కూడా పెన్షన్లు ఎలా తొలగించగలిగారు? అని నిలదీశారు. గతంలో దివ్యాంగులకు ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన ధృవపత్రాలను ఇప్పుడు కాదనడం ఆ వైద్యులను అవమానించడమేనని అన్నారు. 

మూడు హెలికాప్టర్లలో తిరిగే ప్రభుత్వ పెద్దలకు పేదల కష్టాలు కనిపించడం లేదని అన్నారు. దివ్యాంగులను ఆదుకునేందుకు తమ పార్టీ నాయకురాలు ఉషశ్రీ చరణ్‌ ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలు చూసి పెన్షన్లను నిలిపివేయడం దుర్మార్గమని, ఈ విధానాన్ని వెంటనే మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
Lella Appireddy
YS Jagan
disabled pensions
Andhra Pradesh
pension cancellations
TDP government
disability
Usha Sri Charan
Pensions Scheme
AP Politics

More Telugu News