పవన్ కల్యాణ్ కూడా ఇంట్రావర్టే.. రాజకీయాల్లోకి వస్తే నేనూ రాణిస్తా!: నారా రోహిత్

  • రాజకీయాల్లోకి వస్తే దీటుగా సమాధానమిస్తానన్న నారా రోహిత్
  • ఇంట్రావర్ట్ అయినంత మాత్రాన రాజకీయాల్లో రాణించలేనని అనుకోవద్దని వ్యాఖ్య
  • తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని వెల్లడి
రాజకీయాల్లోకి వస్తే తాను కూడా దీటుగా సమాధానం చెప్పగలనని, దీనికి పవన్ కల్యాణే ఉదాహరణ అని ప్రముఖ నటుడు నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన ‘సుందరకాండ’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ... “మీరు అంతర్ముఖుడు (ఇంట్రావర్ట్) కదా.. అలాంటి వ్యక్తి రాజకీయాలకు సరిపోతారా? అక్కడ ముఖం మీదే విమర్శలు వస్తుంటాయి కదా?” అని ప్రశ్నించారు. దీనికి నారా రోహిత్ స్పందిస్తూ... “మా పెదనాన్న రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారో అందరికీ తెలుసు. నేను ఆ కుటుంబం నుంచే వచ్చాను. నేను ఇంట్రావర్ట్ అయినంత మాత్రాన రాజకీయాల్లో రాణించలేనని అనుకోవడం సరికాదు” అని బదులిచ్చారు.

పవన్ కల్యాణ్ ప్రస్తావన తెస్తూ... “పవన్ కల్యాణ్ గారు కూడా సినిమాల్లో ఉన్నంత కాలం ఇంట్రావర్ట్‌గానే ఉన్నారు. కానీ, రాజకీయాల్లోకి అడుగుపెట్టాక తనదైన శైలిలో దూసుకుపోయారు. నేను కూడా రాజకీయాల్లోకి వస్తే అంతే దీటుగా స్పందించే అవకాశం ఉంటుంది” అని నారా రోహిత్ స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇక ‘సుందరకాండ’ చిత్రం విషయానికొస్తే, ఈ సినిమాలో నారా రోహిత్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్, వృత్తి వాగాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించామని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ నారా రోహిత్ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. 


More Telugu News