రాహుల్ గాంధీ 'ఓట్ల చోరీ' ఆరోపణలకు రాజ్ థాకరే మద్దతు!

  • ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కయ్యాయని రాహుల్ విమర్శ
  • ఈ అంశాన్ని తాను 2016-17లోనే లేవనెత్తానని చెప్పిన థాకరే
  • ఎన్నికలను బహిష్కరించాలన్న తన సూచనను ప్రతిపక్షాలు పట్టించుకోలేదని వ్యాఖ్య
  • ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో 'ఓట్ల చోరీ' జరుగుతోందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన తీవ్ర ఆరోపణలకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే అనూహ్యంగా మద్దతు పలికారు. ఈ అంశంపై తాను ఎప్పటినుంచో పోరాడుతున్నానని, ప్రతిపక్షాలు తన మాట వినలేదని ఆయన అన్నారు.

పూణేలో శనివారం జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో రాజ్ థాకరే మాట్లాడుతూ "ఓట్ల తారుమారు అంశం కొత్తదేమీ కాదు. నేను 2016-17లోనే ఈ విషయాన్ని లేవనెత్తాను. అప్పట్లో శరద్ పవార్, సోనియా గాంధీ, మమతా బెనర్జీ వంటి నేతలను కలిసి మాట్లాడాను. లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తే ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుందని సూచించాను. కానీ అందరూ భయపడి వెనక్కి తగ్గారు" అని విమర్శించారు.

ఇప్పుడు రాహుల్ గాంధీ మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావించారని థాకరే గుర్తుచేశారు. "ప్రజలు ఓట్లు వేస్తున్నారు, కానీ ఆ ఓట్లు అభ్యర్థులకు చేరడం లేదు. వాటిని దొంగిలిస్తున్నారు. 2014 నుంచి ఈ ఎన్నికల గందరగోళాన్ని ఉపయోగించుకునే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి" అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపుతూ.. బీజేపీ 132, ఏక్‌నాథ్ షిండే వర్గం 56, అజిత్ పవార్ వర్గం 42 సీట్లు గెలిచినా, ఆ ఫలితాలను గెలిచినవారు గానీ, ఓడినవారు గానీ జీర్ణించుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ నెల ప్రారంభంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ఎన్నికలను దొంగిలిస్తోందని ఆరోపించారు. కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లకు గాను లక్షకు పైగా ఓట్ల చోరీ జరిగిందని, ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లను చేర్చుతున్నారని విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని, లేదంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందించలేదు.


More Telugu News