అమ్మను నాన్నే చంపేశాడు.. కన్నీళ్లతో నిజం చెప్పిన చిన్నారి

  • అదనపు కట్నం కోసం వివాహిత సజీవ దహనం
  • గ్రేటర్ నోయిడాలో వెలుగు చూసిన అమానుష ఘటన
  • అమ్మను నాన్న, నానమ్మ కలిసే నిప్పంటించారని కొడుకు వాంగ్మూలం
  • రూ.36 లక్షలు తేవాలని భర్త, అత్తింటివారి తీవ్ర వేధింపులు
  • నిందితులను కఠినంగా శిక్షించాలని వెల్లువెత్తిన నిరసనలు
కళ్ల ముందే కన్నతల్లిని నాన్న, నానమ్మ కలిసి నిప్పంటించి చంపేస్తుంటే ఆ చిన్నారి గుండె ఎంతలా తల్లడిల్లిపోయిందో! కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ బాలుడు చెప్పిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. అదనపు కట్నం కోసం ఓ వివాహితను ఆమె భర్త, అత్తింటివారు అతి కిరాతకంగా సజీవ దహనం చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ నోయిడాలోని సిర్సా ప్రాంతానికి చెందిన విపిన్ భాటితో నిక్కీ అనే యువతికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు ఆమెను వేధిస్తున్నారు. రూ.36 లక్షలు తీసుకురావాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే గురువారం నిక్కీని దారుణంగా కొట్టి, ఆ తర్వాత లైటర్‌తో నిప్పంటించారు. "అమ్మను కొట్టి, ఆమెపై ఏదో పూశారు. ఆ తర్వాత నిప్పంటించారు" అని నిక్కీ కుమారుడు ఏడుస్తూ పోలీసులకు చెప్పాడు.

నిక్కీ అక్క కంచన్‌ను కూడా అదే కుటుంబంలో ఇచ్చి వివాహం చేశారు. తనను కూడా కట్నం కోసం వేధించారని, గురువారం తెల్లవారుజామున తనపైనా దాడి చేశారని ఆమె వాపోయారు. "నా కళ్ల ముందే నా చెల్లిని కాల్చేశారు. వాళ్లను కూడా అలాగే శిక్షించాలి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిక్కీని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కొడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

తీవ్ర గాయాలతో మంటల్లో కాలిపోతూ నిక్కీ మెట్లపై నుంచి దిగివస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆమెను మొదట ఫోర్టిస్ ఆసుపత్రికి, అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. కంచన్ ఫిర్యాదు మేరకు కస్నా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిక్కీ భర్త విపిన్ భాటి, మామ సత్వీర్, అత్త దయా, బావమరిది రోహిత్ భాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విపిన్‌ను అరెస్ట్ చేయగా, మిగతా వారు పరారీలో ఉన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.


More Telugu News