రాంచీ రోడ్లపై ఆర్మీ హమ్మర్‌తో ధోనీ.. వైరల్ అవుతున్న వీడియో!

  • ఆర్మీ థీమ్‌తో ప్రత్యేకంగా తన కారును మార్పించిన మహీ
  • కారుపై యుద్ధ ట్యాంకులు, సైనికుల చిత్రాలతో కొత్త లుక్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మిస్టర్ కూల్ కారు వీడియో
  • ఐపీఎల్ భవిష్యత్తుపై డిసెంబర్‌లో నిర్ణయం తీసుకుంటానన్న ధోనీ
  • గత ఐపీఎల్‌లో సీఎస్‌కేకు మళ్లీ కెప్టెన్సీ చేసిన ఎంఎస్‌డీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సొంత పట్టణం రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతూ అభిమానులను మరోసారి అబ్బురపరిచాడు. అయితే ఈసారి ఆయన బ్యాట్‌తో కాకుండా, తన ప్రత్యేకమైన హమ్మర్ కారుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత సైన్యం థీమ్‌తో కస్టమైజ్ చేయించిన ఈ కారులో ధోనీ ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మ‌హీ నడిపిన ఈ హమ్మర్ కారుకు ఒక ప్రత్యేకత ఉంది. దానికి పూర్తిగా ఆర్మీ లుక్ ఇచ్చారు. కారుపై యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్‌లు, విమానాలు, విధి నిర్వహణలో ఉన్న సైనికుల చిత్రాలను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ధోని వ్యక్తిగత అభ్యర్థన మేరకు రాంచీకి చెందిన ఓ కార్ డిటైలింగ్ స్టూడియో 2024లో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. స్టూడియో వ్యవస్థాపకుడు అచ్యుత్ కిషోర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

‘కార్ దేఖో’ వెబ్‌సైట్ ప్రకారం, ధోని హమ్మర్ కారు ధర సుమారు రూ. 75 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఆర్మీ థీమ్ మార్పుల కోసం అదనంగా కనీసం రూ. 5 లక్షల వరకు ఖర్చయి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇక క్రికెట్ విషయానికొస్తే, 2025 ఐపీఎల్ సీజన్‌లో ధోనీ మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్‌గా వ్యవహరించారు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో ధోనీ ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ సీజన్‌లో సీఎస్‌కే కేవలం నాలుగు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఇటీవల ఓ కార్యక్రమంలో తన ఐపీఎల్ భవిష్యత్తుపై ధోనీ స్పందించాడు. "వచ్చే ఏడాది ఆడతానో లేదో ఇప్పుడే చెప్పలేను. నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంకా సమయం ఉంది. డిసెంబర్ వరకు వేచి చూసి, ఆ తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తాను" అని ఆయన తెలిపాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్‌డీ, మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.


More Telugu News