Suravaram Sudhakar Reddy: కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

CPI Leader Suravaram Sudhakar Reddy is no more
  • వామపక్ష దిగ్గజం సురవరం అస్తమయం
  • హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అస్తమయం
  • సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ సేవలు
  • నల్గొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నిక
  • కార్మికులు, రైతుల పక్షాన ఎన్నో ఉద్యమాలు
  • ఆయన మృతిపై పలువురు నేతల సంతాపం
వామపక్ష దిగ్గజం, సీపీఐ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు ఉద్యమంలో ఓ శకం ముగిసినట్లయింది. 

సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న హైదరాబాద్‌లో జన్మించారు. కర్నూల్‌లోని మున్సిపల్ హైస్కూల్, కోల్స్ మెమోరియల్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేసి, 1964లో కర్నూల్‌లో బీఏ (హిస్టరీ) చదివి, 1967లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 

15 ఏళ్ల వయసులోనే కర్నూల్‌లోని తన స్కూల్‌లో బ్లాక్‌బోర్డులు, చాక్‌పీసులు, పుస్తకాల కోసం ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. సుధాకర్ రెడ్డి 1971లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌లో చేరారు. 1998లో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, 2004లో రెండోసారి గెలుపొందారు. 2004లో ఆయన లేబర్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 

2000లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో కీలకంగా వ్యవహరించారు.ఆయన మరణంపై సీపీఐ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్ట్ ఉద్యమం ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందని సీపీఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు సానుభూతి తెలిపారు.
Suravaram Sudhakar Reddy
CPI
Communist Party of India
Telangana
Hyderabad
Indian Politician
Left Leader
Nalgonda
Andhra Pradesh

More Telugu News