TTD Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ సమీక్ష

TTD Brahmotsavam Review Meeting on Arrangements for Devotees
  • భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్న ఈవో శ్యామలరావు
  • విశ్రాంతి గృహాలు, కాటేజీల మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలన్న ఈవో
  • వేరొక ప్రాంతంలో కూడా అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలన్న ఈవో
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో ఎలక్ట్రిక్ పనులు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిన్న అధికారులతో ఆయన బ్రహ్మోత్సవాల్లో భక్తుల వసతి, ఇతర సౌకర్యాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని పలు విశ్రాంతి గృహాలు, కాటేజీల మరమ్మతు పనులను రిసెప్షన్ విభాగంతో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాత్రికుల వసతి సముదాయాల్లో కూడా సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నందున వేరొక ప్రాంతంలో కూడా అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆహార భద్రతా అధికారులతో తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీలించాలన్నారు. అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ విభాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించాలని ఆదేశించారు.

తిరుమలలోని హోటళ్లలో భక్తులకు సాంప్రదాయ భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలోని అన్ని కౌంటర్లు పని చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతినెలా నిర్వహించే ఫీడ్ బ్యాక్ సర్వే ద్వారా వచ్చే భక్తుల అభిప్రాయాలను, సలహాలు, సూచనలను తీసుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీఈ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
TTD Brahmotsavam
Tirumala
TTD
Brahmotsavam
Tirumala Brahmotsavam
Srivari Brahmotsavam
Andhra Pradesh Temples
Tirumala Accommodation
Tirupati
TTD EO Syamala Rao

More Telugu News