AP DSC 2025: ఏపీ డీఎస్సీ మెరిట్ లిస్ట్ వచ్చేసింది!

AP DSC 2025 Merit List Released Check Details Here
  • డీఎస్సీ అభ్యర్థుల నిరీక్షణకు తెర
  • మెరిట్ లిస్టును శుక్రవారం రాత్రి విడుదల చేసిన అధికారులు
  • అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీ మెగా డీఎస్సీ 2025కు సంబంధించిన మెరిట్ జాబితాను అధికారులు శుక్రవారం రాత్రి విడుదల చేశారు. అభ్యర్థులు తమ వివరాలను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ప్రకటించారు. అనధికారిక సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని స్పష్టం చేశారు.

వివిధ కేటగిరీల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్లను పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’ పరిధిలోకి వచ్చిన వారికి వారి వ్యక్తిగత లాగిన్ ద్వారా ఈ కాల్ లెటర్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. కాల్ లెటర్ పొందిన వారు తదుపరి ప్రక్రియకు సిద్ధం కావాలని సూచించారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ధృవపత్రాలన్నింటినీ వెంట తీసుకురావాల్సి ఉంటుంది. వాటితో పాటు ఇటీవలే తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి సంతకంతో ధృవీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలను తీసుకురావడం తప్పనిసరి. 

వెరిఫికేషన్‌కు వచ్చే ముందే అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైన పత్రాల జాబితాను (చెక్‌లిస్ట్) కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

నిర్ణీత సమయంలో వెరిఫికేషన్‌కు హాజరుకాని వారికి లేదా సరైన పత్రాలు సమర్పించని వారికి మరో అవకాశం ఉండదని అధికారులు తేల్చిచెప్పారు. అలాంటి సందర్భాల్లో మెరిట్ జాబితాలో తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. 
AP DSC 2025
AP DSC
DSC merit list
AP teacher jobs
teacher recruitment
Andhra Pradesh DSC
AP DSC results
AP DSC notification
government jobs
teacher eligibility test

More Telugu News