కోర్టు ఆదేశాలున్నా... నా కుమారుడు మిథున్ రెడ్డికి జైల్లో సౌకర్యాలు కల్పించడం లేదు: పెద్దిరెడ్డి ఆవేదన

  • రాజమండ్రి జైలులో కుమారుడు మిథున్‌ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖత్
  • వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపణ
  • కోర్టు చెప్పినా మిథున్‌కు సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శ
  • చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తాము ఇలా ప్రవర్తించలేదని వ్యాఖ్య
  • జైలు నుంచి వచ్చాక మిథున్ మరింత రాణిస్తారని ధీమా
ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తన కుమారుడు, ఎంపీ మిథున్‌ రెడ్డికి సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్‌ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని విమర్శించారు. "గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరూ గమనిస్తున్నారు. ఇది స్పష్టంగా కక్ష సాధింపు చర్యే" అని అన్నారు.

కోర్టు ఆదేశించినప్పటికీ, జైలులో మిథున్‌ రెడ్డికి ఆ మేరకు సౌకర్యాలు అందడం లేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఇదే జైలులో చంద్రబాబు ఉన్నప్పుడు తమ ప్రభుత్వం ఎప్పుడూ ఈ విధంగా ప్రవర్తించలేదని ఆయన గుర్తుచేశారు. "ప్రస్తుత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటాం. జైలు నుంచి బయటకు వచ్చాక మిథున్ రెడ్డి మరింత సమర్థవంతంగా రాణిస్తారని నేను భావిస్తున్నాను" అని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 


More Telugu News