కోనసీమలో గోదావరి ఉద్ధృతి.. అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

  • కోనసీమలో గోదావరి వరద పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
  • అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
  • గోదావరి ఉద్ధృతిితో నీట మునిగిన పలు లంక గ్రామాలు
  • ప్రాణాలకు తెగించి పడవలపైనే ప్రజల రాకపోకలు
  • సహాయక చర్యల్లో జాప్యం వద్దని మంత్రి కీలక సూచనలు
గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పెరుగుతున్న వరద ప్రవాహంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లాలో వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలిఫోన్‌లో మాట్లాడిన ఆయన, క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద ముప్పు పొంచి ఉన్న గ్రామాల్లో యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని, అవసరమైతే ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యంగా భావించి, 24 గంటలూ అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందని ఆయన భరోసా ఇచ్చారు.

మరోవైపు, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాలు వరద నీటితో నిండిపోవడంతో అనేక లంక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం కాజ్‌వే వంటివి నీట మునగడంతో, స్థానిక ప్రజలు ప్రయాణాల కోసం పూర్తిగా పడవలపైనే ఆధారపడుతున్నారు. అయితే, అత్యంత ప్రమాదకరంగా ఎలాంటి లైఫ్ జాకెట్లు ధరించకుండానే ప్రయాణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణికులను ఎక్కించుకోవద్దని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని అమలు చేయడంలో స్థానిక అధికారులు శ్రద్ధ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


More Telugu News