ప్రజాపాలన అంటే ఇదేనా?: చెప్పుల వరుస వద్ద రైతు పడుకున్న ఫొటోను ట్వీట్ చేసిన బీఆర్ఎస్, కేటీఆర్

  • తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత
  • గ్రామాల్లోని ఎరువుల కేంద్రాల వద్ద రైతుల బారులు
  • ప్రభుత్వ పాలనపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • రైతులను రోడ్లపైకి తీసుకురావడమేనా ప్రజా పాలన అని బీఆర్ఎస్ ప్రశ్న
తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని అనేక గ్రామాలు, పట్టణాల్లో ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి నిరీక్షిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వ్యవసాయ పనుల సీజన్‌లో ఎరువులు లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.

"ప్రజా పాలన అంటే ప్రజలను ఇలా రోడ్ల మీదకు తీసుకురావడమేనా?" అంటూ బీఆర్ఎస్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది. కేటీఆర్ కూడా సామాజిక మాధ్యమం వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "రేవంత్ రెడ్డీ, నీ దరిద్రపుగొట్టు పాలనకు దక్కిన అసమర్థ ఆస్కార్ అవార్డు ఇది" అంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరు పీఏసీఎస్ ఎదుట చెప్పుల వరుస వద్ద ఒక రైతు పడుకున్న ఫొటోను పంచుకున్నారు. ఈ ఫొటోను ప్రేమ్ కట్టించుకుంటావో.. మెడలో వేసుకొని ఊరేగుతావో నీ ఇష్టమని వ్యంగ్యంగా అన్నారు.

చేతకాని పాలకులను చూశాం కానీ చెప్పులపాలు చేసిన చెత్త రికార్డు మాత్రం రేవంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు. బస్తా యూరియా కోసం రైతు బతుకును బజారున పడేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "అన్నం పెట్టే రైతన్నను పాదరక్షల పాలుచేసిన నీ పాపం ఊరికేపోదు. జై కిసాన్.. జై తెలంగాణ" అంటూ ఆయన పేర్కొన్నారు.


More Telugu News