అండర్-15 బాలుర చేతిలో చిత్తయిన బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు

  • త్వరలో ఐసీసీ మహిళల ప్రపంచకప్ 
  • సన్నాహక టోర్నీ ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 
  • పిల్లల చేతిలో ఓడిపోయిన మహిళల జట్టు
  • 87 పరుగుల భారీ తేడాతో అండర్-15 బాలుర ఘనవిజయం
బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఓ అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది. త్వరలో జరగనున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న బంగ్లాదేశ్ సీనియర్ మహిళల జట్టు, అండర్-15 బాలుర జట్టు చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ మ్యాచ్‌లో కుర్రాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి, సీనియర్ మహిళా క్రికెటర్లను మట్టికరిపించడం క్రీడా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

మహిళల ఛాలెంజ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా బీకేఎస్‌పీ-3 మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఈ విచిత్రమైన ఫలితం నమోదైంది. బంగ్లాదేశ్ అండర్-15 బాలుర జట్టు ఏకంగా 87 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ మహిళల రెడ్ టీమ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అండర్-15 బాలుర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ బయాజిద్ బోస్తామి 46 పరుగులు చేయగా, అఫ్జల్ హుస్సేన్ 44 పరుగులతో రాణించాడు.

అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహిళల రెడ్ టీమ్, బాలుర బౌలింగ్ ధాటికి నిలవలేకపోయింది. కేవలం 38 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. బాలుర జట్టులో అలిముల్ ఇస్లాం ఆదిబ్ కేవలం 12 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా అఫ్రిది తారిఖ్, అబ్దుల్ అజీజ్ చెరో రెండు వికెట్లు తీసి మహిళల జట్టు పతనాన్ని శాసించారు.

మహిళల జట్టులో కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. ఓపెనర్ షర్మిన్ సుల్తానా చేసిన 20 పరుగులే ఆ జట్టులో అత్యధికం కావడం గమనార్హం. కాగా, ఐసీసీ మహిళల ప్రపంచకప్‌కు సన్నాహకంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. మొత్తం మూడు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఇలాంటి ఫలితం రావడం జట్టు సన్నద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.


More Telugu News