చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విష‌యంలో బీసీసీఐ కీలక నిర్ణయం

  • టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
  • 2026 జూన్ వరకు కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించిన బీసీసీఐ
  • ఆయన హయాంలోనే టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజయం
  • కీలక ఆటగాళ్ల విషయంలో అగార్కర్ మేనేజ్‌మెంట్‌పై బోర్డుకు నమ్మకం
  • స్టార్ పేసర్ బుమ్రా వర్క్‌లోడ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్న అగార్కర్
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై బీసీసీఐ పూర్తి విశ్వాసం ఉంచింది. ఆయన పదవీకాలాన్ని 2026 జూన్  వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అగార్కర్ హయాంలో భారత జట్టు వరుసగా 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్ఠాత్మక టైటిళ్లను గెలుచుకోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కు ముందే ఆయన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించినట్లు సమాచారం.

అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, జట్టులో విజయవంతమైన మార్పులు తీసుకురావడంలో సఫలమైంది. "ఆయన పదవీకాలంలో భారత జట్టు టైటిళ్లు గెలవడమే కాకుండా, టెస్టులు, టీ20 జట్లలో మార్పులను కూడా చూసింది. బీసీసీఐ ఆయన కాంట్రాక్ట్‌ను 2026 జూన్ వరకు పొడిగించగా, కొన్ని నెలల క్రితమే అగార్కర్ ఈ ఆఫర్‌ను అంగీకరించారు" అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇదే సమయంలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై అగార్కర్ స్పష్టత ఇచ్చారు. బుమ్రాను దీర్ఘకాలం ఫిట్‌గా ఉంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. "బుమ్రా విషయంలో ప్రత్యేకంగా రాతపూర్వకంగా ఎలాంటి ప్రణాళిక లేదు. కానీ జట్టు మేనేజ్‌మెంట్, ఫిజియోలు ఎప్పటికప్పుడు అతడిని పర్యవేక్షిస్తూనే ఉంటారు. అతను జట్టుకు ఎంత విలువైనవాడో మాకు తెలుసు. అందుకే అతడి గాయానికి ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం" అని అగార్కర్ వివరించారు.

ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి కీలక సిరీస్‌లకు బుమ్రా అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని ఆయన నొక్కిచెప్పారు. గతంలో గాయాల బారిన పడినందున, అతని విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బుమ్రా ఫిట్‌నెస్, జట్టు అవసరాలు, వైద్య బృందం సూచనల ఆధారంగానే అతడిని మ్యాచ్‌లకు ఎంపిక చేస్తామని అగార్కర్ స్పష్టం చేశారు.


More Telugu News