భారత్‌లో యాపిల్ దూకుడు.. బెంగళూరులో కొత్త స్టోర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

  • హెబ్బాల్‌లోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో కొత్త రిటైల్ స్టోర్ 
  • సెప్టెంబర్ 2 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి
  • ముంబై, ఢిల్లీ తర్వాత దేశంలో ఇది మూడో యాపిల్ స్టోర్
  • భారత్‌లోనే అన్ని ఐఫోన్ 17 మోడళ్ల తయారీకి సన్నాహాలు
  • ఐదు స్థానిక ఫ్యాక్టరీలలో అసెంబ్లింగ్ ప్రక్రియ
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్, భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. దేశంలో తన మూడో అధికారిక రిటైల్ స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించనున్నట్లు గురువారం ప్రకటించింది. ‘యాపిల్ హెబ్బాల్’ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ స్టోర్‌ను సెప్టెంబర్ 2న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. బెంగళూరులోని ప్రఖ్యాత ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ఈ కొత్త స్టోర్‌ను ప్రారంభిస్తున్నారు.

భారత్‌లో ఇప్పటికే ముంబై, ఢిల్లీ నగరాల్లో యాపిల్ స్టోర్లు ఉండగా, ఇది మూడోది కావడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టోర్ బ్యారికేడ్‌ను భారత జాతీయ పక్షి నెమలి ఈకల స్ఫూర్తితో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త స్టోర్‌లో యాపిల్ ఉత్పత్తులన్నింటినీ ప్రత్యక్షంగా చూడటంతో పాటు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు పొందే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది. అంతేకాకుండా, ‘టుడే ఎట్ యాపిల్’ పేరుతో ఉచిత సెషన్లను కూడా నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇక రిటైల్ రంగంలోనే కాకుండా, తయారీ రంగంలోనూ యాపిల్ భారత్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. తొలిసారిగా, రాబోయే ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడళ్లను (హై-ఎండ్ ప్రో వెర్షన్‌లతో సహా) పూర్తిగా భారత్‌లోనే అసెంబుల్ చేయాలని యాపిల్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల స‌మాచారం. ఇప్పటివరకు కొన్ని మోడళ్లను మాత్రమే భారత్‌లో తయారు చేస్తుండగా, ఇకపై అన్ని వేరియంట్లను ఇక్కడే ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకోసం ఐదు స్థానిక ఫ్యాక్టరీలతో యాపిల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటిలో రెండు ఫ్యాక్టరీలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అయితే, ‘ప్రో’ మోడళ్ల ఉత్పత్తి పరిమిత సంఖ్యలో ఉండవచ్చని సమాచారం.

స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా, కస్టమర్లను ఆకట్టుకునేందుకు యాపిల్ ప్రత్యేక కార్యక్రమాలను కూడా ప్రకటించింది. యాపిల్ హెబ్బాల్ పేరుతో రూపొందించిన ప్రత్యేక వాల్‌పేపర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, బెంగళూరు స్ఫూర్తితో రూపొందించిన యాపిల్ మ్యూజిక్ ప్లేలిస్ట్‌ను వినవచ్చని కంపెనీ పేర్కొంది. 




More Telugu News