విష ప్రచారాలు ఆపాలి: జగన్‌కు మంత్రి నారాయణ సూచన

  • అమరావతి మునిగిపోతోందన్న విష ప్రచారాలను ఆపాలన్న నారాయణ
  • కొండవీటి వాగుకు మట్టి అడ్డంగా వదిలేయడమే ప్రస్తుత పరిస్థితికి కాణమని వెల్లడి
  • ఇలాగే చేస్తే ఉన్న 11 సీట్లు కూడా వైసీపీకి దక్కవని హెచ్చరిక
రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని రాష్ట్ర మంత్రి నారాయణ హితవు పలికారు. అమరావతి మునిగిపోతోందంటూ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని సూచించారు. కొండవీటి వాగు పరిసరాల్లో నీరు నిలిచిపోయిన నీరుకొండ ప్రాంతాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి, సమస్యకు గల కారణాలను మీడియాకు వివరించారు.

పశ్చిమ బైపాస్ రహదారిపై వంతెన నిర్మాణ సమయంలో తొలగించిన మట్టిని వాగు ప్రవాహానికి అడ్డంగా వదిలేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని మంత్రి స్పష్టం చేశారు. "నిర్మాణ పనులు జరిగేటప్పుడు వర్షం పడితే గుంతల్లోకి నీళ్లు చేరడం సహజం. అంతమాత్రానికే ఐకానిక్ భవనాలు మునిగిపోయాయని ప్రచారం చేయడం సరికాదు" అని అన్నారు. 

కేవలం రెండు గ్రామాల పరిధిలోని పొలాల్లోకి మాత్రమే నీరు చేరిందని, మిగిలిన గ్రామాల్లో వర్షం పడిన కొద్ది గంటల్లోనే నీరు వెళ్లిపోయిందని తెలిపారు. కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకంగా ఉన్న మట్టిని తక్షణమే తొలగించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.

వైసీపీ నేతలు ఇలాగే విష ప్రచారాలు కొనసాగిస్తే, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు గెలిచిన 11 స్థానాలు కూడా దక్కవని నారాయణ హెచ్చరించారు. "రాజధాని మునిగిపోతుందని ఆరోపించే వారు ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితిని చూడాలి. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరు" అని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. 


More Telugu News