కాంగోలో తిరుగుబాటుదారుల నరమేధం.. 52 మంది పౌరుల ఊచకోత

  • తూర్పు కాంగోలో తిరుగుబాటుదారుల ఘాతుకం
  • కనీసం 52 మంది పౌరుల దారుణ హత్య
  • కత్తులు, పారలతో కిరాతకంగా దాడి చేసిన ఉగ్రవాదులు
  • సైన్యం చేతిలో ఓటమికి ప్రతీకారంగానే ఈ దాడి
  • ఇస్లామిక్ స్టేట్ మద్దతున్న ఏడీఎఫ్ తిరుగుబాటుదారుల చర్య
  • మృతుల్లో మహిళలు, చిన్నారులు
  • పెరగనున్న మృతుల సంఖ్య
ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ మద్దతున్న తిరుగుబాటుదారులు 52 మందికి పైగా అమాయక పౌరులను అతి కిరాతకంగా హతమార్చారు. కత్తులు, పారల వంటి ఆయుధాలతో దాడి చేసి వారిని నరికి చంపడం తీవ్ర కలకలం రేపుతోంది. సైన్యం చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అధికారులు వెల్లడించారు.

తూర్పు కాంగోలోని బెనీ, లుబెరో ప్రాంతాల్లో ఈ నెల 9 నుంచి 16వ తేదీ మధ్య ఈ దాడులు జరిగాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఐరాస శాంతి పరిరక్షక మిషన్ (ఎంవోఎన్‌యూఎస్‌సీవో) పేర్కొంది. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని, గాలింపు చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐరాస ప్రతినిధి తెలిపారు.

ఇటీవల కాంగో సైన్యం చేపట్టిన ఆపరేషన్లలో అల్లైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) తిరుగుబాటుదారులు తీవ్రంగా నష్టపోయారని, దానికి ప్రతీకారంగానే పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ మారణకాండకు పాల్పడ్డారని ప్రాంతీయ సైనిక అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ ఎలోంగో క్యోండ్వా మార్క్స్ చెప్పారు. దాడి జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. 

"తిరుగుబాటుదారులు గ్రామాల్లోకి ప్రవేశించి, నిద్రిస్తున్న ప్రజలను నిద్రలేపి ఒకే చోట చేర్చారు. అనంతరం వారిని తాడులతో కట్టేసి, కత్తులు, పారలతో దారుణంగా నరికి చంపారు" అని లుబెరో ప్రాంత అధికారి మకైర్ సివికునుల మీడియాకు వివరించారు. ఒక్క మెలియా గ్రామంలోనే దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారని, కొన్ని ఇళ్లలో మహిళలు, పిల్లల గొంతులు కోసి హత్య చేశారని, అనేక ఇళ్లకు నిప్పు పెట్టారని మరో సైనిక అధికారి అలెన్ కివెవె ఆవేదన వ్యక్తం చేశారు.

ఖనిజ సంపద అధికంగా ఉండే తూర్పు కాంగోలో భూములు, వనరులపై ఆధిపత్యం కోసం పోరాడుతున్న అనేక మిలీషియా గ్రూపులలో ఏడీఎఫ్ ఒకటి. ఇటీవల కాంగో, ఉగాండా సైన్యాలు ఏడీఎఫ్ పై సైనిక చర్యలను ముమ్మరం చేశాయి.


More Telugu News