ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద .. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు

  • విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లో 3.25 క్యూసెక్కుల వరద 
  • బ్యారేజ్ మొత్తం గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల
  • సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం  
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ప్రవాహం ఉద్ధృతంగా పెరుగుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నదీ ప్రవాహం తీవ్రమవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలో వరద నీటి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతుండటంతో, మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 3.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. అదే మొత్తంలో నీటిని బ్యారేజీ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారుల అంచనాల ప్రకారం మధ్యాహ్నానికి వరద ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు, సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది.

లంక గ్రామాల ప్రజలకు హెచ్చరికలు

వరదల వల్ల నదీ తీర ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలకు ప్రమాదం పొంచి ఉండడంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. 


More Telugu News